Tuesday 25 April 2023

ఓ కవి ఆత్మ ప్రబోధం.

రండోయ్.. రారండోయ్...

రాటుదేలిన రాతగాడని

నా మోతే మోగించండోయ్

తుచ్ఛరితే రాయించండోయ్


రండోయ్.. రారండోయ్...

గణ "భజన"ల మొనగాడని

చాటింపే వేయించండోయ్...

పైమెరుగులే చూయించండోయ్


రండోయ్.. రారండోయ్...

రంకు నేర్చిన బొంకు వినరండోయ్

ఇంకు లద్దిన జంకు కనరండోయ్ 

స్వార్థమున్న సలహా తెలుసుకోండోయ్

సత్య చైత్యన్య స్ఫూర్తితో మేలుకోండోయ్ 


నా అవసరానికే మీరు..

నాతో సరితూగే దెవరు..

నా అనుచరులుగానే మీరు

నాతో తలపడే దెవరు..

పల్లకీ తెస్తే బోయీ లయ్యేరు

పటాటోపం చూసి బానిస లయ్యేరు


అబద్ధాలు అవధానంలా చెప్తే

ఆత్మీయతలు రంగరించి మురిసేరు 

అవార్డులు అంగడి సరుకులా కొంటే 

ఆదర్శాలకు ఆమడ దూరమని మరిచేరు

ఇక ప్రశ్నించే దెవరు..నా ప్రతిభని..

పరిశీలించే దెవరు.... నా ప్రగతిని..

చిరునవ్వునే చూస్తూ పోతే

చిట్లించిన నా నొసలెక్కడ కనబడేది

సనాతనమని సమ్మతిస్తూ పోతే

స్వ వర్గ జెండా, అజెండాలే కదా ఎగిరేది..


నీతి మాటలన్నీ నీటి మూటలని

రాత గీతలన్నీ చేత కానివని

ముసుగేసిన నా మనసు మరుగు

తెలిసిన నాడే,

 మీరు బాగుపడేది.. సాహిత్యం కుదుట పడేది..



బొడ్డు మహేందర్

చెన్నూరు, మంచిర్యాల జిల్లా

ఫోన్ 9963427242

April 6, 2023

Monday 20 February 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం పట్ల నా దృక్పథం

 
మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం పట్ల నా దృక్పథం

- బొడ్డు మహేందర్.

మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు జనబాహుళ్యంలో ఉన్న రెండు ఆధార గ్రంథాలు

ఒకటి ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం - బి.ఎన్.శాస్త్రి

రెండోది మన ఆదిలాబాదు - మడిపల్లి భద్రయ్య 

ఇందులో ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం కోసం మన జిల్లాకు ఏమాత్రం సంబంధం లేని, కనీసం పొరుగు జిల్లా వాడైనా కానీ బి.ఎన్ . శాస్త్రి 55 ఏళ్ళ వయసులో 1987-88 సంవత్సరాలలో విషయ సేకరణ చేసి, 1989లో ఆ సమాచారం నుండి చరిత్ర రచన చేసి 1990 ఫిబ్రవరిలో ముద్రించాడు.

మన ఆదిలాబాదు గ్రంథ రచన కోసం మడిపల్లి భద్రయ్య 61ఏళ్ళ వయసులో ఒక చిన్న మోపెడ్ పై డిసెంబర్ 2005నుండి జనవరి 2006 వరకు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల స్వయంగా ప్రయాణించి ఆ ప్రయాణంలో తాను తెలుసుకున్న వివరాలను ప్రయాణ అనుభవాలను అన్నిటినీ క్రోడీకరించాడు. దాతల సహకారంతో ముద్రించాడు. 

ఇలా ఈ ఇద్దరు వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా మరియు ఇతరత్రా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడ ప్రత్యక్షంగా ఎంతో మందిని కలిసి విషయ సేకరణ చేసి తమ నిబద్ధతని,అంకిత భావాన్ని,జిల్లా పట్ల గల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కానీ వారు ఇద్దరు తిరిగిన దాంట్లో ఒక పావు వంతు భూభాగాన్ని , నేడు ఒక చిన్న జిల్లాగా మారిన చరిత్రని మరియు దాని విశిష్టతని మొత్తంగా ఓ 40మంది (ప్రభుత్వ ఉపాధ్యాయులు+పాత్రికేయులు, మరియు రచయితలు) అంతా కలిసి  47  అంశాలుగా విభజించుకుని కూడ ఒక సమగ్ర స్వరూపంకి తీసుకురాకపోవడం పెద్ద లోపమా కాదా? ఇది వీరి అసమర్ధతకు గీటురాయి కాదా ?

ఎంతో కాలం కూడ వెనక్కిపోనవసరం లేదు, 1990లో తొలి పుస్తకం, 2006 లో 2వ పుస్తకం 2022 లో 3 వ పుస్తకం అంటే ఒక్కో పుస్తకానికి మధ్య 16 ఏళ్ళ కాలవ్యవధి అయినా కూడ ఏమి సమాచారం అప్డేట్ అయ్యింది అంటే ఎక్కువ భాగం ఆ రెండు పుస్తకాల్లోని సమాచారం అంత కలిపి ఈ  3 వ బుక్ వేయడం మాత్రమే. 

 


ఆ రెండు పుస్తకాల కాలానికి, అప్పటి పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చితే ఎంతో తేడా ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ తోనే ఎక్కడెక్కడి నుండో సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. అందులో ఎక్కువ భాగం ఉచితంగానే లభిస్తోంది. గ్రంథాలయాలు అందరికీ అందుబాటులోనే  ఉన్నాయి. కనీసం ఓ నాలుగేళ్ల కిందటి నుండి వస్తున్న పాత పత్రికలు,పుస్తకాలు తిరగేసినా సరిపోయేది. ఇవేమీ ఆర్థిక భారం కలిగించేవి కావు. రవాణా సౌకర్యాల విస్తృతి వల్ల  మరియు జిల్లా భౌగోళిక పరిమాణం కూడ చిన్నదే కావడం వల్ల ఇదే పనిగట్టుకొని తిరిగినా ఒక వారం, నెల రోజుల్లోనే గుట్టల కొద్దీ సమాచారం దొరికేది. లేదా ఒక్కో ఏరియా నుండి మంచి ఔత్సాహికులను (ఎలాగో ప్రభుత్వ ఉపాధ్యాయులే రచయితల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి నెట్ వర్క్ సాయంతో)ఎంచుకొని వారి నుంచి సమాచారం సేకరించినా లేదా వారి సహకారం తీసుకున్నా కూడా ఇప్పుడు ఉన్న దానికన్నా రెట్టింపు సమాచారం లభించేది కాదా?

అయినా కూడ ఈ పుస్తక రచయితల్లో ఎంతమంది నిజాయితీగా సమాచారం సేకరించారు అంటే వేళ్ళ పైనే లెక్కపెట్టవచ్చు. ఎక్కువ మంది ఈ మధ్య  దినపత్రికల్లో వచ్చిన కొద్దీ పాటి సమాచారాన్ని, 2020 లో వచ్చిన తోకల రాజేశం రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర ని , కొంతమంది వికీపీడియాని, ఇతరత్రా వెబ్ సైట్ల నుండి కాపీ కొట్టి రాసిన విషయం వాస్తవం కాదా? ఈ విషయం గుర్తు పట్టకుండా ఉండటానికి కనీసం ఆయా గ్రంథాల పేర్లు , సైట్ల పేర్లు కూడ పేర్కొనక పోవడం వీరి సంకుచిత మనస్తత్వానికి తార్కాణం కాదా?

రచయితల పరిస్థితి ఇలా ఉంటె ఈ రచయితల తో రాయించే పని తలకు ఎత్తుకున్న కమిటీ ఏమి చేసిందంటే ఏమో ఏమో అనుకోవాల్సిందే. అసలు ఒక్కరైనా వారికి అప్పగించిన పని చేశారా? 7 మందితో(1+6)కూడిన ఈ కమిటీ సభ్యులు ఒక్కొక్కరు 6గురి బాధ్యత తీసుకొని కూడ ఎందుకు సరిగ్గా రాయించలేక పోయారు.? సమీక్షా సమావేశాల్లో ఎందుకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వలేక పోయారు? మొదట్లో 15 రోజుల సమయం అనుకున్నది కాస్తా 6 నెలల దాకా పొడిగిస్తూ పోయినా ఎందుకు ఈ కాపీ పేస్ట్ ల మీద ఆధార పడాల్సి వచ్చింది.? ఎందుకు ఒక్కరి  వ్యాసం కూడ పునః పరిశీలన చేయలేదు..? ఎందుకు ప్రూఫ్ రీడింగ్ చేయలేదు..? ఎందుకు జిల్లా సంబంధిత అన్ని అంశాల వారీగా సమాచార విభజన జరగలేదు..? ఎందుకు పత్రికా ముఖంగా బహిరంగ ప్రకటన చేయలేదు..? ఎవరికి సులువైన అంశాలని వారే, ముందే ఎందుకు ఎంచుకొన్నారు..? అసలు ఈ రచయితలే రాయగలరు అని మీరు ఎంచుకోవడానికి మీరనుకున్న ప్రాతిపదిక ఏంటి? అనుభవం లేకనా? ఆలోచన, అనుసరణీయ గ్రంథాలు లేకనా?? జన్మ తహా ఇది తమ సొంత జిల్లా కాదనే భావంతో కొందరు ఈ చరిత్ర రచన పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వలనా? లేక ఏమి రాసినా చెల్లుబాటు అవుతుంది. చరిత్రలో నిలిచిపోతుంది. అడిగే వారు ఎవరున్నారు? తప్పు అని చెప్పే వారెవరు? తప్పుల్ని ఎత్తి చూపే ధైర్యం ఎవరికి ఉంది? విమర్శించిన వాళ్ళని ప్రతి విమర్శలతో బెదరగొట్టొచ్చు అనే ధీమా నా?

ఇంత సాంకేతిక యుగంలోనే ఒక16ఏళ్ల కిందటి పుస్తకాన్ని "మన ఆదిలాబాదు" ను కూడ సేకరించి, మీలో ఎక్కువ మంది చదవలేకపోయారు. 2020లో  రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర నే ప్రామాణికంగా భావించి అందులోని సమాచారాన్నే కొందరు యథాతథంగా, మరికొందరు విశ్లేషించి రాసారు. ఇంకో మూడేళ్ళకో, ఐదేళ్లకో ఇంకెవరైనా జిల్లా గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు కూడ మీలాగే బద్ధకస్తులు అయితే వాళ్లకు ఈ పుస్తకం అందుబాటులో ఉంటే, పరిస్థితి ఏంటి..? ఒక అసంపూర్ణ, తప్పుడు రాతల చరిత్ర ను వారసత్వంగా ఇచ్చినట్టే కదా. ఇది సమర్థనీయమేనా..? చరిత్ర రచనలో ఇంత మంది రచయితల సామూహిక రచనా వైఫల్యం దేనిని సూచిస్తుంది.? ఎలా ఉన్నా పర్లేదు, ఎవరేమనుకుంటే మనకేమి మేమూ చరిత్ర రాశాము, చూసుకోండి అని ఊరూరా తిరిగి పుస్తకాలు పంచి మురిసిపోవడంలో అర్థముందా? ఈ పుస్తకాన్ని సవరించి పునర్ముద్రణ కోరడం సబబు కాదా? లేదా ఇక నుండైనా ఈ పుస్తకాన్ని మార్కెట్లో అందబాటులో ఉంచకపోవడం సరైన నిర్ణయం అనిపించుకోదా??ఆలోచించండి.

అసలు ప్రతీ విషయంలో పెద్దరికం చూపడానికి ముందుకు వచ్చే సాహితీ పెద్దలు(వయసురీత్యా), ఘనా పాఠీలు, ఉద్దండులు ఒక్కరు కూడ ఈ పుస్తకంలోని లోపాల పట్ల ఎందుకు స్పందించడం లేదు.? తమ వరకే ఆలోచించుకునే ఈ కుంచిత బుద్ధి, స్వార్థం ఎదుటి వారికి నీతులు బోధించే అర్హత కలిగి ఉంటుందా..? మనోళ్లే కదా అంతా అని గురివింద గింజ గా మిగిలిపోతారా?

జిల్లా సాహిత్య రంగంలో ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా అవమానం జరిగినా మొదట ఎలుగెత్తి చాటుతున్నది నేను కాదా.? ప్రపంచ తెలుగు మహాసభల నుండి జిల్లా స్థాయి కవి సమ్మేళనాల వరకు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంత మంది ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించే నా లాంటి వాళ్లకు ఎంతమంది మద్దతుగా నిలుస్తున్నారు..? భజనలతో పబ్బం గడుపుకుంటూ కడుపులో చల్ల కదలకుండా పని కానిచ్చుకోడం మీ పెద్దరికమా? మీ తెలివికి, లౌక్యానికి నిదర్శనమా? అసలు మీతో(ఈ పుస్తకానికి సంబంధించిన అందరు రచయితలతో) నాకేమైనా వ్యక్తిగత ద్వేషం ఉందా? మిమ్మల్ని ఆహో ఓహో అంటూ నేనే కదా ఒక ఏడాదిన్నర పాటు నవ తెలంగాణ దినపత్రిక అంకురం శీర్షికన వ్యాసాలు రాసాను. సాహిత్య అకాడమీ జిల్లా సాహిత్య చరిత్రల విషయంలో "పుస్తక ముద్రణ"ను ప్రాతిపదికగా ఎంచుకున్నప్పుడు అది తప్పని, అందరి గురించి రాయాల్సిందే అని  ఎన్ని సార్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశానో అందరికీ తెలుసు. మరియు మన జిల్లా రచయిత అయిన తోకల రాజేశంకి  ఎన్నిసార్లు చెప్పానో ఆయనకు తెలుసు. 

అసలు నా ప్రధాన విమర్శ అంతా ఈ పుస్తకంలోని విషయం అంతా సరిగ్గా లేదు, సమగ్రంగా కవర్ కాలేదు అనే కదా. కానీ ఈ విమర్శను ఎంతమంది హుందాగా స్వీకరించారు అంటే ఓ ఐదారు మందే. అందరికీ నేను ఇప్పుడు ఓ విలన్ ని, వారి తప్పుల్ని ఎత్తి చుపాను కనుక. ఈ విషయంలో నేనేమీ పశ్చాతాపం చెందట్లేదు. ఈ వ్యాసాల రచన మొదలుపెట్టక ముందే ఎదురయ్యే అన్ని పరిస్థితులని ఊహించాను, మొక్కవోని ధైర్యంతో నిలబడ్డాను. ఇప్పటివరకు నేను కేవలం 18 అంశాల పైనే విమర్శ చేశాను. మొత్తం 47 అంశాలను సమీక్షిస్తాను అని చెప్పాను. కానీ నా వ్యాపార వ్యవహారాల వల్ల ఈ రచన ఆలస్యమవుతోంది. నేను 2 నెలలుగా చెప్తూనే ఉన్నాను. అయినా ఒక్కరైనా నా వ్యాసాల్లో తప్పులు ఎంచలేకపోయారు. ఎందుకంటే అది ఒక కఠిన వాస్తవం. చేదుగా ఉన్నా భరించాల్సిందే. ఇంకా కూడ మిగతా అంశాల సమీక్ష, విమర్శ,విశ్లేషణ రాస్తాను. ఈ పుస్తకంలోని అనేక "జాతి రత్నాల" వంటి వ్యాసాలు ఇంకా నా విమర్శలకు కాచుకొని ఉన్నాయి. ఆలోపు నా పుస్తకం "అస్తిత్వం - జిల్లా చరిత్ర, సాహిత్యం " కి కూడ ఒక తుది రూపు ఇస్తాను. ఇక చివరగా చెప్పేది ఏంటంటే మీరు నా విమర్శలకు మొహం చాటేసినా, ముఖం మాడ్చుకున్నా లేదా నాపై ఏ కుట్రలు చేసినా నా దృష్టికి వచ్చిన ప్రతీ నిజాన్ని, మీ నైజాన్ని లిఖితం చేస్తాను,చరిత్రలో నిలుపుతాను. ఇందులో ఏ మార్పు లేదు. సత్యమేవ జయతే.


20 February 2023

Friday 10 February 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..పార్ట్ 4


 "*మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం"

సమీక్ష, విమర్శ, విశ్లేషణ

- బొడ్డు మహేందర్, చెన్నూరు

9963427242

పార్ట్ -4

15 వ వ్యాసం దండేపల్లి మండలం కు చెందిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు నాగవర్మ ముత్యం రాసిన "జిల్లా అనువాద సాహిత్యం." మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర లో ప్రస్తావించని(విస్మరణకు గురైన) ఎన్.రాధే శ్యామ్ యొక్క అనువాద సాహిత్యం కృషిని గురించి ప్రధానంగా ఈ వ్యాసం రాసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 3 పేజీల వ్యాసంలో 1 పేజీ రాధే శ్యామ్ గురించే ఉంటుంది. అయినా బాగుంది. కానీ సంస్కృతం నుండి ఎక్కువగా తెనుగీకరించిన నాగినేని లీలా ప్రసాద్ పుస్తకాలను నామ మాత్రంగా కూడ ప్రస్తావించకపోవడం సబబు కాదనిపిస్తుంది. అలాగే కామారెడ్డికి చెందిన ప్రముఖ అనువాదకుడు, రచయిత ఎనిశెట్టి శంకర్ కొమురం భీమ్ నవలని ఆంగ్లంలోకి తర్జుమా చేసాడు.ఆయన పేరు పేర్కొనలేదు. ఆయనే2021లో ప్రచురించిన Sling Shot - An Anthology of translation poems లో మన జిల్లా కవి నూటెంకి రవీంద్ర రాసిన "మరణమంటే" అనే కవితకు ఆంగ్ల అనువాదం Death means  పేరుతో ఉంది. కాబట్టి పరిశోధన అనుకూలంగా ఆధారాలు ఇవ్వడం మంచిది అని నా అభిప్రాయం. ఇక కేవలం ఇక్కడి అనువాద రచయితల గురించే కాకుండా, ఇక్కడి వారి సాహిత్యం ఏవేమి ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయో కొంత పరిశోధించి, పరిశీలించి వ్యాసకర్త  రాసినట్టు తెలుస్తోంది. ఇందుకు వారు అభినందనీయులు. 

అయితే ఈ క్రమంలో తోకల రాజేశం అయినా, ముత్యం నాగవర్మ అయినా ఒక విషయాన్ని మర్చిపోయారు. అదే వీరందరి కన్నా మునుపే  వానమామలై వరదాచార్యులు మరాఠీ నుండి తెలుగులోకి అనువదించిన గీత్ రామాయణం(మరాఠీ నుండి తెలుగులోకి అనువదించడంలో ఉపాధ్యాయుడైన మహంకాళి దత్తాత్రేయ సహకరించారు), స్త్రోత్ర రత్నావళి, అలాగే శాకీర్ అనే ఉర్దూ కవి రాసిన  కవితల్ని "శాకీర్ గీతాంజలి"గా ఉర్దూ నుండి తెలుగుకు చేసిన అనువాద కృషిని గుర్తించలేక పోయారు.(మహంకాళి దత్తాత్రేయ గురించి సాహిత్య చరిత్రలో ఉంది) అలాగే చెన్నూరు కు చెందిన బెల్లంకొండ మల్లారెడ్డి నవయుగ భారతి వారు ప్రచురించిన ఓ 5హిందీ పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. వీటిలో సురేష్ సోనీ అనే రచయిత హిందీలో రాసిన "ఉజ్వల భారతీయ వైజ్ఞానిక పరంపర" అనే హిందీ పుస్తకాన్ని 2009లో అదే పేరుతో తెలుగులోకి అనువదించి రాసిన గ్రంథానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ వ్యాస  పరంపరలో విస్మరణకు గురైన మరో రచయిత తాండూరు మండలం అచ్చలాపూర్ కు చెందిన వేద పండితుడు అప్పాల శ్యామ్ ప్రణీత్ శర్మ. శ్రీ శివ పార్వతీ కళ్యాణం, జీర్ణోద్ధణ విధి పేరిట ముద్రించిన రెండు గ్రంథాలూ సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించినవే. ఇప్పటివరకు 250కు పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చినా, 9 పుస్తకాలు ముద్రించినా కూడ ఈ రచయితకి సరైన గుర్తింపు లభించలేదు. 

కారణం ప్రక్రియల వారీగా వ్యాసాలు రాయడం, అందులో వ్యాసం, ఆధ్యాత్మిక రచనల విభాగాన్ని విస్మరించడం. దీని వల్ల స్వచ్ఛందంగా వ్యాసాల ద్వారా సామాజిక చైతన్యానికి, చరిత్ర నిర్మాణానికి పాటుపడుతున్న ఎందరో విస్మరణకు గురవుతున్నారు. ఉదాహరణకు నస్పూర్ కు చెందిన బి.రాజ్ కుమార్ వంటి పాత్రికేయులు ముద్రించిన పుస్తకాలు("అభివృద్ధి - విధ్వంసం" 2016లో ప్రచురణ )  పరిగణనలోకి రాకుండా పోతున్నాయి. శీలప్ప రామకృష్ణ శాస్త్రి రాసిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం, పులి దత్తాత్రేయ శర్మ, కొమ్మేర దత్తు మూర్తి  సంయుక్తంగా సంకలనం చేసిన "ఆపస్తంభీయ అపర కర్మ ప్రయోగ చంద్రిక", వంటి సనాతన ధర్మ సంబంధ పుస్తకాలు మరుగున పడుతున్నాయి. అలాగే వివిధ సంకలనాలలో ప్రచురితమైన అనేక పరిశోధక వ్యాసాలు విలువ లేకుండా పోతున్నాయి. ఉదాహరణకు 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మూసీ మాసపత్రిక ప్రచురించిన "31జిల్లాల ఆలోకనం" లో మన జిల్లా గురించి శతావధాని పట్వర్ధన్ ఒక వ్యాసం రాశారు. దాని గురించి ఈ పుస్తకంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే జిల్లా ఏర్పడ్డాక పద్యానికి, అవధాన ప్రక్రియకు పునర్వైభవం తెచ్చే దిశగా ఆయన చేసిన కృషి కూడ ఈ పుస్తకంలో నమోదు కాలేదు. ఇదంతా అంశాల వారీగా విభజించి రాయడం వల్ల కలిగిన లోపం.  ఇలా ప్రక్రియల వారీగా విభజించకుండా వ్యక్తుల వారీగా విషయ సేకరణ చేస్తే ఆయా రచయితల సంపూర్ణ మూర్తిమత్వం, వివిధ రంగాల్లో వారి కృషి వెలుగులోకి వచ్చేది.

ఈ సందర్భంగా రచయితలకు, పాఠకులకు ఒక విషయం గుర్తు చేయాలి అనుకుంటున్న. అదేమిటంటే మన ప్రాంతంలో అక్షరాస్యత శాతమే చాలా తక్కువ. అందునా నిజాంల ఏలుబడిలో చదువంతా ఉర్దూ మాధ్యమంలోనే. అలాంటప్పుడు ఇక్కడ ఉర్దూ సాహిత్యమో, ఉర్దూ లోనే మన చరిత్ర రాయడమో జరిగి ఉంటుంది కదా. మరి వారిని(ఉర్దూ కవులు,రచయితలను) ఎందుకు ఒక్కరు కూడా సంప్రదించే ప్రయత్నం చేయలేదు. వారు ఈ జిల్లాలోనే ఉంటున్నప్పుడు జిల్లా చరిత్ర లో వారి గురించి కూడ రాయాలి కదా. జిల్లా కేవలం తెలుగు సాహిత్య కారులదే కాదు కదా. ఇక్కడి ఉండి ఏ రంగంలో అయినా, ఏ భాష లో అయినా విశిష్ట సేవలు అందించిన వారిని కుల, మత, జాతి , ప్రాంతాలకు అతీతంగా స్మరించడం, గౌరవించడం మన కనీస నైతిక బాధ్యత కాదా.. ఈ కోణంలో ఆలోచించి పరిశోధిస్తే ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చేవో..!! 

మరో విషయం కూడ గుర్తు చేస్తున్న. ఇప్పటివరకు మన జిల్లాకు సంబంధించిన వివరాలు 2 పుస్తకాలలోనే ఉన్నాయి. అవి ఆదిలాబాద్ జిల్లా విజ్ఞాన సర్వస్వం - బి.ఎన్.శాస్త్రి ; మన ఆదిలాబాదు - మడిపల్లి భద్రయ్య   ఈ రెండింటినీ మనం ఆధార గ్రంథాలు గానే స్వీకరించాలి కానీ, ప్రామాణికం అని భావించకూడదు. ఎందుకంటే పరిశీలిస్తే వాటిలోనూ ఎన్నో తప్పులున్నాయి. వాటిని ప్రామాణికం అని భావించిన తోకల రాజేశం రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర లోనూ అక్కడక్కడ తప్పులు దొర్లాయి. దాన్నే గుడ్డిగా కాపీ కొట్టేసిన ఈ అసమగ్ర స్వరూపంలో అంతకు మించి తప్పులు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నూరుకు సంబంధించి జ్యోతిష్య పండితుడు శ్రీరాంభట్ల చంద్రశేఖర సిద్ధాంతి పార్వతీశ్వర శతకం రచించారు. కానీ తోకల రాజేశం రాసిన పుస్తకంలో హెడింగ్ శ్రీరాం భట్ల వెంకటేశ్వర సిద్ధాంతి అని ఉంటుంది. దాన్ని గుడ్డిగా అనుసరించి రాసిన పెద్ది భరత్ వ్యాసంలోనూ అదే పేరు నమోదైంది.పైగా రెండిటిలోనూ పుస్తకాలు అలభ్యం అని రాశారు. అసలు ఆ పేరు గల రచయిత ఉండనప్పుడు పాఠకులు చదివేది అంతా తప్పుడు చరిత్రనే కదా. దీన్ని నిజమని భావిస్తే చరిత్ర పరిశోధకులు తల పట్టుకుని కూర్చోవాలి. ఇక 2020లో వచ్చిన పుస్తకానికి 2023లో వచ్చిన పుస్తకానికి 3 ఏళ్ల కాల వ్యవధి ఉన్నది. ఎన్నో సాంకేతిక మార్పులు, సాహిత్య తీరులు మారాయి. ఈ కాలాన్ని అప్డేట్ చేయకుంటే ఇప్పటికీ ఆ చంద్రశేఖర సిద్ధాంతి పుస్తకాలు లభ్యం అవట్లేదు అని సరిపెట్టుకుంటాం. అదే అప్డేట్ చేసి ఉంటే, 2021 జనవరి 10న చంద్రశేఖర సిద్ధాంతి రాసిన పార్వతీ శతకం పునర్ముద్రణ పొందిన విషయం తెలిసేది, చరిత్రలో రికార్డు అయ్యేది.

16వ వ్యాసం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లేదాళ్ళ గాయత్రి రాసిన "బాల సాహిత్యం." స్వతహాగా కవయిత్రి,కథకులు అవడం, బాల సాహిత్యంపై మక్కువ కలిగి ఉండటం వల్ల కూడ జిల్లాలోని బాల సాహిత్య కారులపై మంచి సమాచారమే ఇచ్చారు. అయితే శతక సాహిత్యం గురించి రాసిన పెద్ది భరత్ గానీ, బాల సాహిత్యం గురించి రాసిన ఈ వ్యాసకర్త గానీ తోకల రాజేశం నే తొలి బాల కవి గా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ప్రచురితమైన అన్ని పుస్తకాల్లోనూ వానమామలై వరదచార్యులు 13వ ఏట(1925సం.) నుండే పద్య రచన,గేయాలు రాసేవారని రికార్డ్ అయ్యి ఉంది. అలాంటప్పుడు 2003 లో రాసిన కవి తొలి బాల కవి ఎలా అవుతాడు. అలాగే పిల్లల కోసం కూడ వానమామలై వరదాచార్యులు "పోతన చరిత్ర" అనే పేరుతోనే సరళ తెలుగులో ఓ పుస్తకాన్ని రచించారు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ప్రస్తుతం ఈ పుస్తకం టిటిడి వారి అధికారిక వెబ్సైట్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడ. దీని గురించి రాయలేదు. ఇక 2004లో ప్రచురితమైన "బాల కవితా రసాలం" అనే ఓ పుస్తకాన్ని ఆధారం చేసుకొని అందులో ఉన్న వారందరినీ పేరుపేరున ప్రస్తావించిన పెద్ది భరత్ మరియు ఈ వ్యాసకర్త ల్యాదాల గాయత్రి ఇరువురూ కూడ అదే గ్రంథం ఆధారంగా ఓ ఇద్దరిని తొలి బాల కవయిత్రి, తొలి మహ్మదీయ బాల కవి అని పేర్కొనడం సబబు కాదేమో..!! వారు చేసిన ఈ నిర్ధారణకు ప్రాతిపదిక ఏంటి..? వీరు చేసిన పరిశోధన ఏంటి..? ఇంకా బాల సాహిత్యం అని ప్రత్యేకంగా రాస్తున్నప్పుడు అయినా అనేక మంది బాల కవులు వెలుగులోకి రావడానికి ముఖ్య కారకుడు, బోధకుడు అయిన జక్కేపల్లి నాగేశ్వర రావు కృషిని గురించి మరింత వివరంగా రాయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కోణంలో ఒక ప్రోత్సాహకుడిగా మాత్రమే ఆయన గురించిన ప్రస్తావన ఉంది కానీ, జక్కెపల్లి వారి కృషి ఫలితంగానే బాల కవితా రసాలం, బాల కవుల శతక సంపద ముద్రించబడ్డాయి. ఇందులో "బాల కవుల శతక సంపద" సంకలన గ్రంథం ఆయనకే అంకితమివ్వబడింది. కానీ ఈ విషయాలేవీ రాయలేదు మరియు కనీసం ఈ పుస్తకాలు పేర్లు కూడ పేర్కొనలేదు.అలాగే అనువాద  రచనలు చేసిన బెల్లంకొండ మల్లారెడ్డి 1971-80 మధ్య కాలంలో శిశుమందిర్ పిల్లల కోసం హిందీలో ఉన్న 10కి పైగా  మహనీయుల జీవిత చరిత్రలను,అల్లూరి సీతారామరాజు బుర్ర కథని సరళ తెలుగులోకి అనువదించారు. ఇంకా బాల సాహిత్యం కోసం ప్రత్యేకంగా https://kotthapalli.in అనే ఓ వెబ్సైట్ ను పెట్టిన సత్య ఫౌండేషన్ ఛైర్మన్, సాహితీ పోషకుడు(కవి నీర్ల మధునయ్య రచనల ముద్రణకు ఇతోధికంగా సహకారం అందించారు) చెన్నూరు వాస్తవ్యుడు అయిన పోటు సత్యనారాయణ రెడ్డి కృషిని కూడ రాయాల్సిన అవసరం ఉంది. 2008 సంవత్సరంలో తన అల్లుడైన గడియారం వేంకట నారాయణ శర్మ సహకారంతో స్థాపించిన ఈ వెబ్సైట్ లో ఎక్కువగా అనంతపురం జిల్లాలోని కొత్తపల్లి గ్రామ పాఠశాల విద్యార్థుల రచనలే ఉన్నాయి. అయినప్పటికీ ఓ మూడు సంచికల్లో మన మంచిర్యాల జిల్లాకు చెందిన చెన్నూరు, భావురావు పేట, టేకుమట్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కథలు(రాసినవి),పాటలు(గానం చేసినవి) మనకు కన్పిస్తాయి. 2012లో టేకుమట్లకు చెందిన 7వ తరగతి విద్యార్థిని తాటం మానస రాసిన "రహస్యం చెబితే" కథ ముద్రితమైంది. 2013 మార్చిలో చెన్నూరు శిషుమందిర్ విద్యార్థులు రాసిన గొలుసుకట్టు పదాల కథ "ప్రయత్నం - ఫలితం" ప్రచురితమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడినప్పుడు వెబ్సైట్ గురించి ఎక్కువగా ప్రచారం చేయకపోవడం, స్థానికంగా విషయ సేకరణ చేయకపోవడం వల్ల ఇక్కడి వారి రచనలు తక్కువగా ఉన్నాయి అని చెప్పారు. అయినా కూడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బాల సాహిత్యాన్ని వెలికి తీయడానికి తన వంతుగా తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందించిన  పోటు సత్యనారాయణ రెడ్డి సేవలు వెలకట్టలేనివి. 2008 నుండి 2020 ఫిబ్రవరి వరకు 107సంచికలతో  నిరంతరంగా సేవలు అందించిన ఈ వెబ్సైట్ కరోనా సృష్టించిన ఆర్థిక మాంద్య ప్రభావంతో ఆగిపోయింది. అయినప్పటికీ డొమైన్ ఆక్టివ్ గా ఉంటడం వల్ల దాని పాత సంచికలను ఇప్పటికీ మనం వీక్షించవచ్చు. 

మళ్లీ ఈ వ్యాస విషయానికొస్తే.. ప్రస్తుతం రాస్తున్న బాల కవుల గురించి ఇందులో ప్రస్తావన కూడా లేదు. ఉదాహరణకు చెన్నూరు నుండి చెన్న వేదాంత,లక్షెట్టిపేట కు చెందిన లింగంపల్లి శ్రావణ్ కుమార్ వంటి వారెందరో నిత్యం ఇక్కడి కవి సమ్మేళనాలలో పాల్గొంటూ తమని తాము మెరుగుపర్చుకుంటున్నారు. శ్రావణ్ కుమార్ అయితే ఈ-బుక్స్ ఫార్మెట్ లో The art from my Heart, The undiluted feelings   అనే పేర్లతో 2 ఆంగ్ల కవితల పుస్తకాలని అమెజాన్ కిండల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచాడు. The Flying Rainbow పేరుతో 100 ఆంగ్ల కవితల పుస్తకాన్ని కూడ ఫిబ్రవరి 15,2022 నాడు ఆవిష్కరించాడు.

17వ వ్యాసం పాత్రికేయులు కొమ్మేర రామమూర్తి రాసిన "సంగీత ప్రపంచంలో జిల్లా వెలుగులు". పేరుకు జిల్లా వెలుగులు అని ఉన్నా ఈ వ్యాసం ప్రధానంగా జక్కేపల్లి వంశంలోని సంగీత కళాకారులను వెలుగులో ఉంచేందుకు రాసింది. మొత్తం 8 పేజీల వ్యాసం లో 6 పేజీలు కేవలం వారి వంశస్థుల కీర్తికే అంకితమైనది. వారు కాకుండా మరో 4 గురి గురించి రాసినా కూడ అందులో గుర్రాల చిలుకలయ్య అలియాస్ శ్రీధర్ గురించిన వివరణ కనీసం సైడ్ హెడింగ్ కి కూడ నోచుకోలేదు. పునః పరిశీలన, ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం వల్ల జరిగిన తప్పిదం ఇది. ఇక ఇందులో పేర్కొన్న వారే కాకుండా ప్రస్తుతం అనేక మంది నూతన కళాకారులకు,గాయకులకు,గేయ రచయితలకు ఊతమిచ్చేలా వారి వారి ఆడియో, వీడియో లకు సంగీతం అందిస్తున్న కరుణాకర్, మాడుగుల వెంకటేష్ ల గురించి ప్రస్తావించి ఉండాల్సింది. కరుణాకర్ మంచిర్యాలలో ఫ్రేయ స్టూడియో ద్వారా, మాడుగుల వెంకటేష్ బెల్లంపల్లిలో స్వరాంజలి మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీతంలో కృషి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రచయితలు సాహిత్యం మీద పెట్టిన దృష్టి ఇతర కళలపై పెట్టకపోవడం వల్ల ఆయా రంగాల నిపుణుల చరిత్ర మరుగున పడిపోతోంది. ఆ కోణంలో ఈ వ్యాసం తో పాటు రాబోయే మరికొన్ని వ్యాసాలు విలువైనవి అని చెప్పొచ్చు. అయితే మరికొంత పరిశీలన, పరిశోధన చేసి ఉంటే బాగుండేది.

18వ వ్యాసం లక్షెట్టిపేటకు చెందిన  ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి అయిన నూటెంకి రవీంద్ర రాసిన "జిల్లా శిల్పకారులు - చిత్రకారులు" వస్తుపరంగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న విషయం మరియు ఆ రంగంతో ఎంతో కొంత అభిరుచి, ఆసక్తి ఉన్న వారికే తెలిసే విషయం ఇది. బహుశా వ్యాసకర్త సంతానం సంప్రదాయ చదువులకు భిన్నంగా ఫైన్ ఆర్ట్స్ పై ఫోకస్ పెట్టడం వల్ల వ్యాసకర్త కూడ ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసినట్లు కనిపిస్తోంది. 30మంది కళాకారులను ఈ వ్యాసం ద్వారా వ్యాసకర్త వెలుగులోకి తేవడం అభినందనీయం. ఈ వ్యాసంలో లోపాలు వేతకలేను గానీ ప్రస్తుత చిత్రకారులు కొందరు మంచిర్యాలలో చిత్రకళ ఆర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను స్థాపించి ఇక్కడి ఔత్సాహిక చిత్రకారులకు ప్రముఖుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే ఇక్కడి కళాకారుల సంక్షేమం కోసం కూడ కృషి చేస్తున్నారు. దీన్ని ప్రస్తావిస్తే బాగుండేది. లేదా వారిని సంప్రదించిన కూడ మరెన్నో విషయాలు తెలిసేవి. ఇక పెద్దపల్లి జిల్లాలోని రామగిరి కోట పై ప్రస్తుతం నెలకొల్పి ఉన్న హనుమాన్ విగ్రహాన్ని చెక్కినది మంచిర్యాల జిల్లాకే చెందిన గడ్డం బాపు అని వికీపీడియా ద్వారా తెలుస్తోంది.

మరికొన్ని వ్యాసాల సమీక్ష సమాలోచన తర్వాతి భాగంలో..

10 February 2023

Thursday 19 January 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..పార్ట్ 3


 "మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం"

విమర్శ, విశ్లేషణ, సమీక్ష పార్ట్ 3

- బొడ్డు మహేందర్, చెన్నూరు 9963427242

"మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం" పై నా విమర్శ, విశ్లేషణ, సమీక్ష వ్యాసం పార్ట్ 3 భాగం చాలా పెద్దగా అయిపోయింది. కాబట్టి పార్ట్ 3లో నలుగురు(11-14) వ్యాసకర్తల గురించి ఈరోజు పోస్ట్ చేస్తున్న. ఈ కొంత భాగ వ్యాసమే గత పార్ట్2 తో సమానంగా ఉంది. మిగతా (15-20) వ్యాసకర్తల గురించి మరో భాగంగా పోస్ట్ చేస్తాను. గమనించగలరు.

11వ వ్యాసం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వైద్య సుజాత రాసిన "జిల్లా కథా సాహిత్యం". ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య తో మొదలుపెట్టి ఒక్క కథని రాసిన జిల్లాలోని వర్ధమాన కవుల వరకు అందరి గురించి బాగానే రాసారు. అయితే అల్లం రాజయ్య కథల గురించి ప్రస్తావిస్తూ ఆయన 2000సంవత్సరం వరకు రాసిన కథలు,4(3+1) కథా సంకలనాల గురించి మాత్రమే రాసారు. బండకింది బతుకులు అనే కథా సంపుటిలోని కథ కూడ "అతడు(అల్లం రాజయ్య సాహిత్యం -6 "లో ముద్రించినట్టు రచయిత్రి గమనించినట్లు లేదు. ఇక 2000 నుండి 2015వరకు తన రచనా వ్యాసంగానికి తాత్కాలిక విరామం ఇచ్చిన (ఆ కాలంలో ఏమీ రాయలేదు అని స్వయంగా అల్లం రాజయ్య నే చాలాసార్లు పేర్కొన్నారు.) ఆయన గత 6,7ఏళ్ల నుండి మళ్లీ రాస్తున్న మరియు రాసిన వాటి గురించి ; కథా రచయితగా ఆయన సాధించిన ఘనత గురించి రాయలేదు.  ప్రత్యేకంగా కాకపోయినా వివిధ కథా సంకలనాల్లో ఆయన రాసిన నూతన కథలు అచ్చవుతున్నాయి. ఉదాహణకు కొత్త కథ -2018 (కథా సంకలనం). 2015లో "కథా స్రవంతి - అల్లం రాజయ్య కథలు" ను అరసం ప్రచురించింది. అలాగే అల్లం రాజయ్య కథా సాహిత్యం ని ఉస్మానియా, కాకతీయ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్  విశ్వవిద్యాలయాలు పి.హెచ్. డి, ఎం. ఫిల్ ప్రవేశ పరీక్షల సిలబస్ లో మరియు ఎం.ఏ తెలుగు పాఠ్యాంశాలలో ఒక టాపిక్ గా చేర్చాయి... లాంటి విషయాలని అప్డేట్ చేయలేదు. పైగా ఆయన సాహిత్య కృషిని వివరిస్తూ తోకల రాజేశం రాసిన జిల్లా సాహిత్య చరిత్ర నుండే 3 పేరాలను యథాతథంగా రాసేశారు. కానీ ఆధార గ్రంథంగా సూచిస్తూ దాని గురించి రాయలేదు. పరిశోధనకు సంబంధించి తొలిసారిగా 1987లో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన కె. నాగేశ్వర చారి పేరును పేర్కొనలేదు.  ఇక పరిశోధకురాలు ఎం.విజయలక్ష్మి చేసిన కృషి 1997 అయితే 1977 అని తప్పుగా ముద్రించబడింది. తల్లిచేప కథా సంపుటిని ప్రస్తావిస్తూ వరవర రావు రాసిన ముందు మాటల్ని పేర్కొన్నారు కానీ, అల్లం రాజయ్య సాహిత్యానికి సంబంధించి వరవరరావు రాసిన 285 పేజీల ముందు మాటలన్నీ కలిపి "జైత్రయాత్ర (2021)"అనే పుస్తకంగా వచ్చిన విషయాన్ని కూడ పేర్కొంటే బాగుండేది. ఇక "అల్లం రాజయ్య సాహిత్య అధ్యయన కేంద్రం " పేరుతో ఫేస్బుక్ లో ఓ పేజీని రూపొందించి అందులో అల్లం రాజయ్య కు సంబంధించిన పాత, కొత్త విషయాలు అన్నీ ఒక పరిశోధన స్థాయిలో సంకలనం చేస్తున్న జిల్లాకే చెందిన కథా రచయిత ఇట్యాల వెంకట కిషన్ కృషి గురించి రాస్తే భావి రచయితలకు, పరిశోధకులకు మరెంతో మార్గదర్శకంగా ఉండేది.

ఇక "దళిత కథలు" రాసిన గూడ అంజయ్య గురించి రాస్తూ రచయిత్రి కథల గురించి తన అభిప్రాయాలను కాకుండా పుస్తకంలో రాసిన రచయిత అభిప్రాయాలనే యథాతథంగా తీసుకున్నారు. అలాగే ఈ కథలు శాతవాహన యూనివర్సిటీ  ఎం.ఏ తెలుగు పాఠ్యాంశాలలో చేర్చిన విషయం గురించి రాయలేదు.  ఆ తర్వాత జిల్లాలో 3వ ప్రముఖ కథకుడిగా తన భర్త అయిన అల్లాడి శ్రీనివాస్ (ఈ పుస్తకం కోర్ కమిటీ సభ్యుడు)ని చూపే ప్రయత్నం చేసింది. ఇది మనకు ఆయన గురించి రాసిన మొదటి వాక్యంలోనే అర్థమవుతుంది. 2019లో కేవలం 16కథలతో ముద్రితమైన ఒకే ఒక కథా సంపుటాన్ని వర్ణిస్తూ అవసరమైన దాని కన్నా ఎక్కువ స్పేస్ నే తీసుకొని ఎప్పటి నుండో రాస్తున్న మిగతా కథకులని చిన్నబుచ్చింది.

అభివృద్ధిలోనూ, అక్షరాస్యతలోనూ ఎప్పుడూ వెనుకబడే ఉన్న అడవి జిల్లాల వారసులం మనం. మన ప్రాచీన చరిత్ర సరిగ్గా రికార్డు కాలేదో.. మరి రికార్డ్ అయిన దాన్ని కూడ మనం గుర్తించ లేకపోతున్నామో, భద్రపరచ లేకపోతున్నామో గానీ ఓహ్ 30,40 ఏళ్ల కిందటి తెలిసిన సంగతుల్లోకే తప్ప మరింత లోతుల్లోకి వెళ్ళలేక పోతున్నాం. ఈ వ్యాసకర్త కూడ ప్రస్తుతం కథలు రాసిన వారి గురించి తప్ప చరిత్రని తవ్వే ప్రయత్నం చేయలేదు. అందువల్ల మంచిర్యాలకే చెందిన ఓ ఇద్దరి రచయితల ప్రస్తావన ఈ వ్యాసంలో మిస్సయింది. వారే నాగుల రాధే శ్యామ్, సిరిమల్లె రూప. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) 1996లో ప్రచురించిన ఋతుపవనాలు అనే కథా సంకలనంలో నాగుల రాధేశ్యాం రాసిన "జింకపిల్ల" కథతో పాటు సిరిమల్లె రూప రాసిన "ఝాన్సీ" కథ  ప్రచురితమయ్యాయి. అలాగే సిరిమల్లె రూప రాసిన "పనిపిల్ల" కథ ఆహ్వానం పత్రికలో జూలై 1, 1996లో ప్రచురితమైనట్లు కథానిలయం వెబ్సైట్ ద్వారా మనకు తెలియవస్తోంది.

12 వ వ్యాసం ఈ పుస్తక కోర్ కమిటీ సభ్యుడిగా కూడ ఉన్నటువంటి దండేపల్లి కి చెందిన  ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయిత  కొండు జనార్ధన్ రాసిన "జిల్లా నవలా రచయితలు".  అల్లం రాజయ్య ని ఇందులో జిల్లా తొలితరం నవలా రచయితగా పేర్కొన్నారు కానీ ఈయన కంటే ముందే వానమామలై వరదచార్యులు మానవులంతా మనవాళ్ళే అనే నవల రచించారు. అయితే అది అముద్రితం. దీని గురించి ఇంతవరకు జిల్లాకు సంబంధించిన ఏ చరిత్ర  పుస్తకాల్లోనూ రాయలేదు. అల్లం రాజయ్య 1975లో ఉద్యోగ రీత్యా మంచిర్యాలకు వచ్చారు, స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సృజన మాస పత్రిక 1977  ఆగస్ట్, సెప్టెంబర్ సంచికల్లో అల్లం రాజయ్య మొదటి కథ "ఎదురు తిరిగితే " ప్రచురించబడింది. కానీ అప్పటికే ఇక్కడ లబ్ధ ప్రతిష్టుడైన కవి వానమామలై ఉన్నారు. నవల ముద్రితం కాకున్నా రాసి ఉన్నారు. అలాంటప్పుడు జిల్లా తొలితరం నవలా రచయిత అల్లం రాజయ్య ఎలా అవుతారు..? అల్లం రాజయ్య రచనలపై పరిశోధనలు జరుగుతున్నాయి అని పేర్కొన్న రచయిత వాటి వివరాలు తెలియజేయలేదు. కనీసంగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న, ఆయన నవలా సాహిత్యం కు సంబంధించి 1995లో పి.హెచ్.డి పట్టా కోసం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో రాచపాళెం చంద్రేఖరరెడ్డి ఆధ్వర్యంలో పరిశోధన చేసిన కె. నాగేశ్వర చారి " మహా శ్వేతా దేవి - అల్లం రాజయ్య నవల ల తులనాత్మక పరిశీలన "ను పేర్కొనలేదు. ఇక ఒక్కో నవల గురించి సంక్షిప్తంగా పరిచయం చేసే క్రమంలో అగ్ని కణం నవలలో ప్రధాన పాత్ర పేరు మాదిగ బయ్యక్క అయితే బక్కయ్య గా ముద్రించారు. గూడ అంజయ్య రచనల గురించి రాస్తూ పొలిమేర(నవల)తో పాటు పొద్దు పొడుపు ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. పొద్దుపొడుపు పేరుతో ఆయన ఇంతవరకు ఏ కథ గానీ,నవల గానీ రాయలేదు. మరి ఈ పొద్దు పొడుపు ఏంటో వ్యాసకర్తనే చెప్పాలి. ఈ వ్యాసం ఉద్దేశ్యమే ఆయా రచయితల నవలలను పరిచయం చేయడం, కుదిరితే వాటి విశ్లేషణ చేయడం. కానీ జనార్ధన్ కేవలం ఈ నవల కు సంబంధించి 2 వాక్యాలు రాసి మిగతా 2 పేజీలు అంతా నవలా రచయితని పోగడటానికే వాడుకున్నాడు. విశేషమేమిటంటే కనీసం ఈ నవలలోని అంశం ఏంటో కూడ ఇందులో రాయలేదు. కొత్తగా మరో ఇద్దరు కూడ నవలలు రాశారు అని వివరణలు ఇచ్చారు గానీ వాటిలో ఏవి ముద్రిత్రమో అముద్రితమో స్పష్టంగా పేర్కొనలేదు. ఇంకా ఇక్కడి సింగరేణి కార్మికోద్యమ చరిత్రను తన నవలల్లో, కథల్లో రికార్డ్ చేసిన రచయిత పి  చంద్ ఉరఫ్ ఊరగొండ యాదగిరి చేసిన కృషిని గానీ, ఆయన రచన మా ఊరి కథ(నవల)ని గానీ పేర్కొని ఉంటే బాగుండేది.

13వ వ్యాసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఈ పుస్తక కోర్ కమిటీలో కూడ సభ్యుడైన దండనాయకుల వామన రావు రాసిన "జిల్లా గేయ సాహిత్యం". వ్యాసం మొదటి పేరాలోనే ఈ వ్యాస ఆధారాలు, ప్రాతిపాదికలు అన్నిటినీ పేర్కొని తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డాడు కానీ రాసినంత వరకైనా సమగ్రంగా ఉందా లేదా అని సరిచూసుకోలేదు. వానమామలై వరదచార్యుల గేయ కావ్యాలను మూడింటినీ పేర్కొన్న వ్యాసకర్త..పూర్తి వివరాలకు ఇదే పుస్తకంలోని వేరొకరి వ్యాసం చూడండి అని చెప్పడం సమంజసం అనిపించలేదు. ముద్రిత గీత సంపుటులే అయిన స్తోత్ర రత్నావళి, గీత రామాయణం, హనుమాన్ చాలీసా అనువాదాలను నామ మాత్రంగా కూడ రాయలేదు. తర్వాత గూడ అంజయ్య రాసిన ఒక పుస్తక సంకలనం ఊరు మనదిరా గురించే రాసారు కానీ ఆ తర్వాత 1992-2006 మధ్య రాసిన తెలంగాణ పాటలను "తెలంగాణ పాటలు పేరుతో అచ్చు వేసిన సంగతి, వాయిస్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఆడియో క్యాసెట్లు,సీడీలు వచ్చిన సంగతి, ఇంకా గూడ అంజయ్య సిన్మా పాటలు(2007) సంకలనం గురించి గానీ రాయలేదు. బహుశా వానమామలై గురించి మరొకరి వ్యాసాన్ని చదవండి అని సూచించినట్లుగానే, గూడ అంజయ్య గురించి కూడ మరొకరి వ్యాసంలో చదువుకోండి అందామనుకోవచ్చు. కానీ అది కూడ రాయడం మర్చిపోయాడు. ఇక గేయ సంపుటిని ప్రచురించిన వారికే ప్రాధాన్యం అని చెప్పుకున్న వ్యాసకర్త మరి అందరి గేయ సంపుటులని ఎందుకని పేర్కొనలేదు. వ్యాసంలో పేర్కొన్న  33మందిలో 13మంది పుస్తకాలు ప్రచురించని విషయం గుర్తుకు రాలేదేమో!. పోనీ ప్రచురించిన వారి పేరైనా పేర్కొన్నారా అంటే అదీ లేదు. 2019 మార్చి 10న "భక్తి పాటలు" పేరిట పుస్తకం విడుదల చేసిన కనుకుంట్ల కమల(పుష్పలత)ని ప్రస్తావించలేదు. అన్నిటికన్నా పరాకాష్ట అసలు పాటే రాయని అంతడుపుల నాగరాజును గేయకర్త చేసేసి, అతను నృత్య దర్శకత్వం వహించిన వీడియోలను ఆధారాలుగా పేర్కొనడం. ఇక ఆయన గురించి కూడ కొన్ని తప్పులు దొర్లాయి. అంతడ్పుల నాగరాజు సాధారణ  ధూమ్ ధాం కళాకారుడు కాదు, ఆయనే ఆ నృత్య రూప కల్పన కు వ్యవస్థాపకుడు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉండగా అవన్నీ వదిలేసి ఎప్పటివో ఒక 5 ఆల్బమ్ పేర్లు పేర్కొన్నారు. అందులోనూ అక్షర దోషాలే. జానపదం కాదు, "ఊరంతా జానపదం" ఆయన ఆల్బమ్ పేరు. ఇక ఒకే ఒక్క పాట రాసి(?) ప్రాచుర్యం పొందిన గాయని మధుప్రియ ని కూడ గేయ కవిగా పేర్కొన్నారు. మరి 2షార్ట్ ఫిలిం సాంగ్స్ తో పాటు 62 పేరడీ పాటలు రాసిన నా గురించి ఎందుకు రాయలేదో? రాయాలని అనిపించలేదో?..అందులో 12 పేరడీ పాటలు సూర్య, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో అచ్చయిన సంగతి తెలియదా. మిగతా పాటలు 2017 లో ఈటీవీ ప్లస్ ముకాబ్ లా పేరడీ షో లో మొదటి నుండి చివరి వరకు ప్రసారమైన సంగతి తెలియదా..? ఇదంతా పక్కన పెడితే ఒక కోర్ కమిటీ సభ్యుడిగా తనకు అప్పజెప్పిన బాధ్యత అయినా సరిగ్గా నెరవేర్చారా..? నాకు ఒక వ్యాసం రాయమని చెప్పి, 15రోజుల్లోనే గడువు అయిపోయింది అని నాతో ఎందుకు చెప్పినట్లు. అదే మిగతా వాళ్ళకి 6నెలల సమయం ఇచ్చి మళ్లీ మళ్లీ అడిగి ఎందుకు రాయించుకున్నట్లు..? బహుశా నేను రాసిన వ్యాసం లేకపోతేనే సారస్వత పరిషత్ సంతృప్తి చెంది ముద్రిస్తాను లేకుంటే ముద్రించను అని హెచ్చరించినదేమో పాపం.

ఇక ఎలాగో గేయం గురించి వ్యాసం రాశాను కదా అనుకుని అదే ఊపులో "మంచిర్యాల వైభవం" పేరుతో ఓ గేయం కూడ రాశారు ఈ వ్యాసకర్త. కానీ అది ఈ వ్యాసానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా పుస్తకం చివరి పేజీలో ప్రచురించారు. కానీ మనకు విషయ సూచిక లో 47వ అంశంగా, దీన్ని ఒక కవిత గా పేర్కొన్నారు. మరి ఆ కవిత/గేయం కోసం ప్రత్యేకంగా ఎప్పుడో చివరన రాసేకన్నా ఇప్పుడే దాని గుట్టు విప్పాలని ఇక్కడే రాస్తున్న. అసలు ఒక జిల్లా కు సంబంధించి ఎటువంటి ప్రత్యేకతలు చెప్పకుండా ఒక జిల్లా గేయం రాయడం, ఆ జిల్లా పేరు తీసేసి ఏ ప్రాంతం పేరు పెట్టినా అది అన్నిటికీ సెట్ అయ్యేలా ఉండటం సామాన్య విషయం కాదు. అందుకే కావొచ్చు పుస్తక కమిటీ ఆగమేఘాల మీద ఆమోదించి, పరిషత్ సంతృప్తి చెంది  ప్రామాణికమైన జిల్లా ఘన చరిత్ర ను ఈ గేయం ద్వారా తెల్సుకొండి అని ముద్రించారు. ఈ గేయం గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్తే రసజ్ఞులైన మీ పాఠక హృదయాలు మరింత గాయపడవచ్చు అని ఇంతటితో ఆపేస్తున్న.

14వ వ్యాసం సినీ సాహిత్య పరిశోధన లో డాక్టరేట్ పట్టా పొందిన తెలుగు ఉపన్యాసకుడు జక్కుల రాయమల్లు రాసిన "సాహిత్య పరిశోధకులు - విమర్శకులు". ఈ వ్యాసంలో జిల్లాలోని సాహితీ పరిశోధకుల గురించి సంక్షిప్తంగా అయినా బాగా రాసారు. ఒక రకంగా ఈ పరిశోధకుల సమాచారం రాబట్టడం ధ్రువీకరించడం అంత సులువు కాదు. అయినా కూడా ఈ విషయంలో వ్యాసకర్త సఫలీకృుతుడయ్యాడనే చెప్పొచ్చు. ఒక వేళ లోపాల గురించి, సమగ్రంగా అందర్నీ ప్రస్తావించాడా లేదా చెప్పాలన్నా కూడ అదొక పి.హెచ్ డి స్థాయి పరిశోధన అవుతుంది. కానీ నా వరకు నాకు తెలిసింది చెప్పాలి అనుకుంటున్న. బెల్లంపల్లి కి చెందిన ఇవటూరి అనురాధ "వానమామలై వరదచార్యుల కృతమైన పోతన చరిత్రము- సమగ్ర పరిశీలన" పేరుతో 2006-07లో  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో పరిశోధించి ఎం. ఫిల్ పట్టా పొందారు. అయితే  వ్యాసంలో ఈమె గురించి రాయలేదు. ఇక విమర్శ వ్యాసాల విభాగంలో నా గురించి రాశారు. కానీ ఓ పరిశోధనాభిలాషిగా నేను  ఇప్పటివరకు 14 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించాను. 2019 నుండి వరుసగా ఏడాదిన్నర పాటు ప్రతి బుధవారం నవ తెలంగాణ దినత్రిక "అంకురం" శీర్షికలో జిల్లా సాహిత్యకారుల గురించే ప్రత్యేకంగా రాశాను. ఒక రకంగా మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర కన్నా ముందే పత్రికా ముఖంగా ఇక్కడి సాహిత్యకారుల గురించి నేను వ్యాసాలు రాశాను. అయినా కూడ జిల్లా సాహిత్య చరిత్ర పుస్తకంలో గానీ,ప్రస్తుత ఈ గ్రంథంలో గానీ దాని ప్రస్తావనే లేదు. నేను ప్రత్యక్షంగా పరిచయం లేకున్నా, మాట్లాడుకున్నా ఎక్కడో  బాసరలో ఉన్న ఈ వ్యాసకర్తకి కూడ నా సాహిత్య కృషి తెలిసి ఓ రెండు వాక్యాలైనా రాశాడు కానీ ఎప్పుడూ నాతో పలకరిస్తూ నా ప్రతీ పనిని గమనిస్తూ ఉండే తోటి సాహిత్యకారులు ఎందుకు రాయలేకపోయారు.? ఇందులో ఏమైనా కుట్ర ఉందనుకోవాలా..?

19 January 2023