Monday 20 February 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం పట్ల నా దృక్పథం

 
మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం పట్ల నా దృక్పథం

- బొడ్డు మహేందర్.

మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు జనబాహుళ్యంలో ఉన్న రెండు ఆధార గ్రంథాలు

ఒకటి ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం - బి.ఎన్.శాస్త్రి

రెండోది మన ఆదిలాబాదు - మడిపల్లి భద్రయ్య 

ఇందులో ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం కోసం మన జిల్లాకు ఏమాత్రం సంబంధం లేని, కనీసం పొరుగు జిల్లా వాడైనా కానీ బి.ఎన్ . శాస్త్రి 55 ఏళ్ళ వయసులో 1987-88 సంవత్సరాలలో విషయ సేకరణ చేసి, 1989లో ఆ సమాచారం నుండి చరిత్ర రచన చేసి 1990 ఫిబ్రవరిలో ముద్రించాడు.

మన ఆదిలాబాదు గ్రంథ రచన కోసం మడిపల్లి భద్రయ్య 61ఏళ్ళ వయసులో ఒక చిన్న మోపెడ్ పై డిసెంబర్ 2005నుండి జనవరి 2006 వరకు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల స్వయంగా ప్రయాణించి ఆ ప్రయాణంలో తాను తెలుసుకున్న వివరాలను ప్రయాణ అనుభవాలను అన్నిటినీ క్రోడీకరించాడు. దాతల సహకారంతో ముద్రించాడు. 

ఇలా ఈ ఇద్దరు వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా మరియు ఇతరత్రా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడ ప్రత్యక్షంగా ఎంతో మందిని కలిసి విషయ సేకరణ చేసి తమ నిబద్ధతని,అంకిత భావాన్ని,జిల్లా పట్ల గల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కానీ వారు ఇద్దరు తిరిగిన దాంట్లో ఒక పావు వంతు భూభాగాన్ని , నేడు ఒక చిన్న జిల్లాగా మారిన చరిత్రని మరియు దాని విశిష్టతని మొత్తంగా ఓ 40మంది (ప్రభుత్వ ఉపాధ్యాయులు+పాత్రికేయులు, మరియు రచయితలు) అంతా కలిసి  47  అంశాలుగా విభజించుకుని కూడ ఒక సమగ్ర స్వరూపంకి తీసుకురాకపోవడం పెద్ద లోపమా కాదా? ఇది వీరి అసమర్ధతకు గీటురాయి కాదా ?

ఎంతో కాలం కూడ వెనక్కిపోనవసరం లేదు, 1990లో తొలి పుస్తకం, 2006 లో 2వ పుస్తకం 2022 లో 3 వ పుస్తకం అంటే ఒక్కో పుస్తకానికి మధ్య 16 ఏళ్ళ కాలవ్యవధి అయినా కూడ ఏమి సమాచారం అప్డేట్ అయ్యింది అంటే ఎక్కువ భాగం ఆ రెండు పుస్తకాల్లోని సమాచారం అంత కలిపి ఈ  3 వ బుక్ వేయడం మాత్రమే. 

 


ఆ రెండు పుస్తకాల కాలానికి, అప్పటి పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చితే ఎంతో తేడా ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ తోనే ఎక్కడెక్కడి నుండో సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. అందులో ఎక్కువ భాగం ఉచితంగానే లభిస్తోంది. గ్రంథాలయాలు అందరికీ అందుబాటులోనే  ఉన్నాయి. కనీసం ఓ నాలుగేళ్ల కిందటి నుండి వస్తున్న పాత పత్రికలు,పుస్తకాలు తిరగేసినా సరిపోయేది. ఇవేమీ ఆర్థిక భారం కలిగించేవి కావు. రవాణా సౌకర్యాల విస్తృతి వల్ల  మరియు జిల్లా భౌగోళిక పరిమాణం కూడ చిన్నదే కావడం వల్ల ఇదే పనిగట్టుకొని తిరిగినా ఒక వారం, నెల రోజుల్లోనే గుట్టల కొద్దీ సమాచారం దొరికేది. లేదా ఒక్కో ఏరియా నుండి మంచి ఔత్సాహికులను (ఎలాగో ప్రభుత్వ ఉపాధ్యాయులే రచయితల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి నెట్ వర్క్ సాయంతో)ఎంచుకొని వారి నుంచి సమాచారం సేకరించినా లేదా వారి సహకారం తీసుకున్నా కూడా ఇప్పుడు ఉన్న దానికన్నా రెట్టింపు సమాచారం లభించేది కాదా?

అయినా కూడ ఈ పుస్తక రచయితల్లో ఎంతమంది నిజాయితీగా సమాచారం సేకరించారు అంటే వేళ్ళ పైనే లెక్కపెట్టవచ్చు. ఎక్కువ మంది ఈ మధ్య  దినపత్రికల్లో వచ్చిన కొద్దీ పాటి సమాచారాన్ని, 2020 లో వచ్చిన తోకల రాజేశం రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర ని , కొంతమంది వికీపీడియాని, ఇతరత్రా వెబ్ సైట్ల నుండి కాపీ కొట్టి రాసిన విషయం వాస్తవం కాదా? ఈ విషయం గుర్తు పట్టకుండా ఉండటానికి కనీసం ఆయా గ్రంథాల పేర్లు , సైట్ల పేర్లు కూడ పేర్కొనక పోవడం వీరి సంకుచిత మనస్తత్వానికి తార్కాణం కాదా?

రచయితల పరిస్థితి ఇలా ఉంటె ఈ రచయితల తో రాయించే పని తలకు ఎత్తుకున్న కమిటీ ఏమి చేసిందంటే ఏమో ఏమో అనుకోవాల్సిందే. అసలు ఒక్కరైనా వారికి అప్పగించిన పని చేశారా? 7 మందితో(1+6)కూడిన ఈ కమిటీ సభ్యులు ఒక్కొక్కరు 6గురి బాధ్యత తీసుకొని కూడ ఎందుకు సరిగ్గా రాయించలేక పోయారు.? సమీక్షా సమావేశాల్లో ఎందుకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వలేక పోయారు? మొదట్లో 15 రోజుల సమయం అనుకున్నది కాస్తా 6 నెలల దాకా పొడిగిస్తూ పోయినా ఎందుకు ఈ కాపీ పేస్ట్ ల మీద ఆధార పడాల్సి వచ్చింది.? ఎందుకు ఒక్కరి  వ్యాసం కూడ పునః పరిశీలన చేయలేదు..? ఎందుకు ప్రూఫ్ రీడింగ్ చేయలేదు..? ఎందుకు జిల్లా సంబంధిత అన్ని అంశాల వారీగా సమాచార విభజన జరగలేదు..? ఎందుకు పత్రికా ముఖంగా బహిరంగ ప్రకటన చేయలేదు..? ఎవరికి సులువైన అంశాలని వారే, ముందే ఎందుకు ఎంచుకొన్నారు..? అసలు ఈ రచయితలే రాయగలరు అని మీరు ఎంచుకోవడానికి మీరనుకున్న ప్రాతిపదిక ఏంటి? అనుభవం లేకనా? ఆలోచన, అనుసరణీయ గ్రంథాలు లేకనా?? జన్మ తహా ఇది తమ సొంత జిల్లా కాదనే భావంతో కొందరు ఈ చరిత్ర రచన పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వలనా? లేక ఏమి రాసినా చెల్లుబాటు అవుతుంది. చరిత్రలో నిలిచిపోతుంది. అడిగే వారు ఎవరున్నారు? తప్పు అని చెప్పే వారెవరు? తప్పుల్ని ఎత్తి చూపే ధైర్యం ఎవరికి ఉంది? విమర్శించిన వాళ్ళని ప్రతి విమర్శలతో బెదరగొట్టొచ్చు అనే ధీమా నా?

ఇంత సాంకేతిక యుగంలోనే ఒక16ఏళ్ల కిందటి పుస్తకాన్ని "మన ఆదిలాబాదు" ను కూడ సేకరించి, మీలో ఎక్కువ మంది చదవలేకపోయారు. 2020లో  రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర నే ప్రామాణికంగా భావించి అందులోని సమాచారాన్నే కొందరు యథాతథంగా, మరికొందరు విశ్లేషించి రాసారు. ఇంకో మూడేళ్ళకో, ఐదేళ్లకో ఇంకెవరైనా జిల్లా గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు కూడ మీలాగే బద్ధకస్తులు అయితే వాళ్లకు ఈ పుస్తకం అందుబాటులో ఉంటే, పరిస్థితి ఏంటి..? ఒక అసంపూర్ణ, తప్పుడు రాతల చరిత్ర ను వారసత్వంగా ఇచ్చినట్టే కదా. ఇది సమర్థనీయమేనా..? చరిత్ర రచనలో ఇంత మంది రచయితల సామూహిక రచనా వైఫల్యం దేనిని సూచిస్తుంది.? ఎలా ఉన్నా పర్లేదు, ఎవరేమనుకుంటే మనకేమి మేమూ చరిత్ర రాశాము, చూసుకోండి అని ఊరూరా తిరిగి పుస్తకాలు పంచి మురిసిపోవడంలో అర్థముందా? ఈ పుస్తకాన్ని సవరించి పునర్ముద్రణ కోరడం సబబు కాదా? లేదా ఇక నుండైనా ఈ పుస్తకాన్ని మార్కెట్లో అందబాటులో ఉంచకపోవడం సరైన నిర్ణయం అనిపించుకోదా??ఆలోచించండి.

అసలు ప్రతీ విషయంలో పెద్దరికం చూపడానికి ముందుకు వచ్చే సాహితీ పెద్దలు(వయసురీత్యా), ఘనా పాఠీలు, ఉద్దండులు ఒక్కరు కూడ ఈ పుస్తకంలోని లోపాల పట్ల ఎందుకు స్పందించడం లేదు.? తమ వరకే ఆలోచించుకునే ఈ కుంచిత బుద్ధి, స్వార్థం ఎదుటి వారికి నీతులు బోధించే అర్హత కలిగి ఉంటుందా..? మనోళ్లే కదా అంతా అని గురివింద గింజ గా మిగిలిపోతారా?

జిల్లా సాహిత్య రంగంలో ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా అవమానం జరిగినా మొదట ఎలుగెత్తి చాటుతున్నది నేను కాదా.? ప్రపంచ తెలుగు మహాసభల నుండి జిల్లా స్థాయి కవి సమ్మేళనాల వరకు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంత మంది ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించే నా లాంటి వాళ్లకు ఎంతమంది మద్దతుగా నిలుస్తున్నారు..? భజనలతో పబ్బం గడుపుకుంటూ కడుపులో చల్ల కదలకుండా పని కానిచ్చుకోడం మీ పెద్దరికమా? మీ తెలివికి, లౌక్యానికి నిదర్శనమా? అసలు మీతో(ఈ పుస్తకానికి సంబంధించిన అందరు రచయితలతో) నాకేమైనా వ్యక్తిగత ద్వేషం ఉందా? మిమ్మల్ని ఆహో ఓహో అంటూ నేనే కదా ఒక ఏడాదిన్నర పాటు నవ తెలంగాణ దినపత్రిక అంకురం శీర్షికన వ్యాసాలు రాసాను. సాహిత్య అకాడమీ జిల్లా సాహిత్య చరిత్రల విషయంలో "పుస్తక ముద్రణ"ను ప్రాతిపదికగా ఎంచుకున్నప్పుడు అది తప్పని, అందరి గురించి రాయాల్సిందే అని  ఎన్ని సార్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశానో అందరికీ తెలుసు. మరియు మన జిల్లా రచయిత అయిన తోకల రాజేశంకి  ఎన్నిసార్లు చెప్పానో ఆయనకు తెలుసు. 

అసలు నా ప్రధాన విమర్శ అంతా ఈ పుస్తకంలోని విషయం అంతా సరిగ్గా లేదు, సమగ్రంగా కవర్ కాలేదు అనే కదా. కానీ ఈ విమర్శను ఎంతమంది హుందాగా స్వీకరించారు అంటే ఓ ఐదారు మందే. అందరికీ నేను ఇప్పుడు ఓ విలన్ ని, వారి తప్పుల్ని ఎత్తి చుపాను కనుక. ఈ విషయంలో నేనేమీ పశ్చాతాపం చెందట్లేదు. ఈ వ్యాసాల రచన మొదలుపెట్టక ముందే ఎదురయ్యే అన్ని పరిస్థితులని ఊహించాను, మొక్కవోని ధైర్యంతో నిలబడ్డాను. ఇప్పటివరకు నేను కేవలం 18 అంశాల పైనే విమర్శ చేశాను. మొత్తం 47 అంశాలను సమీక్షిస్తాను అని చెప్పాను. కానీ నా వ్యాపార వ్యవహారాల వల్ల ఈ రచన ఆలస్యమవుతోంది. నేను 2 నెలలుగా చెప్తూనే ఉన్నాను. అయినా ఒక్కరైనా నా వ్యాసాల్లో తప్పులు ఎంచలేకపోయారు. ఎందుకంటే అది ఒక కఠిన వాస్తవం. చేదుగా ఉన్నా భరించాల్సిందే. ఇంకా కూడ మిగతా అంశాల సమీక్ష, విమర్శ,విశ్లేషణ రాస్తాను. ఈ పుస్తకంలోని అనేక "జాతి రత్నాల" వంటి వ్యాసాలు ఇంకా నా విమర్శలకు కాచుకొని ఉన్నాయి. ఆలోపు నా పుస్తకం "అస్తిత్వం - జిల్లా చరిత్ర, సాహిత్యం " కి కూడ ఒక తుది రూపు ఇస్తాను. ఇక చివరగా చెప్పేది ఏంటంటే మీరు నా విమర్శలకు మొహం చాటేసినా, ముఖం మాడ్చుకున్నా లేదా నాపై ఏ కుట్రలు చేసినా నా దృష్టికి వచ్చిన ప్రతీ నిజాన్ని, మీ నైజాన్ని లిఖితం చేస్తాను,చరిత్రలో నిలుపుతాను. ఇందులో ఏ మార్పు లేదు. సత్యమేవ జయతే.


20 February 2023

No comments:

Post a Comment