Showing posts with label సామాజిక కవితలు. Show all posts
Showing posts with label సామాజిక కవితలు. Show all posts

Sunday, 2 March 2014

వద్దమ్మా వద్దు.. రావద్దు..

వద్దమ్మా వద్దు.. రావద్దు..
ఈ హద్దు దాటి లోపల చొరబడవద్దు..
మానవ మృగాల మస్తిష్కం 
నీ జీవితాన్ని చేస్తుంది అతి శుష్కం
కలుషిత మనుషుల కాలుష్యం
నిను బలి చేయమని చెబుతుంది భాష్యం
వద్దమ్మా వద్దు.. రావద్దు..
ఈ హద్దు దాటి లోపల చొరబడవద్దు..
ఇక్కడ 
నీ స్వేచ్ఛ ఎవరికీ పట్టదు
నీ బ్రతుకు ఎవరికీ నచ్చదు.
నీ సాయం మరిచిన కుళ్ళు జాతమ్మా ఇది.
స్వార్థం నిండిన దుష్ట జాతమ్మా ఇది.
వద్దమ్మా వద్దు.. రావద్దు..
ఈ హద్దు దాటి లోపల చొరబడవద్దు..
******************************
written by BODDU MAHENDER
at 6pm, 2.3.2014

Sunday, 1 December 2013

జాగ్రత్త .. తస్మాత్ జాగ్రత్త .. నేస్తం.. !!

అలక్ష్యమో, అజాగ్రత్తో, అసహాయతో
కారణమేదైనా చుట్టుముడుతుంది 
నిన్ను ఓ అపాయం..
ఇక మొదలవుతుంది నీలో
నరక బాధల నవ జీవిత అధ్యాయం..
అసలే అది 
చికిత్సే లేని చిత్రవధల రూపితం  
దేహ స్థితి గతుల్ని మార్చే  వైరస్ ల స్థాపితం  

జాగ్రత్త .. తస్మాత్ జాగ్రత్త .. నేస్తం.. !!
ఎయిడ్స్ బారిన పడి కోల్పోకు నీ సమస్తం..
***********************************
written by BODDU MAHENDER
at 3 : 30pm, 1.12.2013

( December 1 - World Ailds Day )

Wednesday, 4 September 2013

రూపాయికి రూపం తీసేస్తూ


మనల్ని మనమే లోకువ చేసుకుంటాం.
మనకి మనమే ఓ ముద్ర వేసుకుంటాం.
మనల్ని మనమే కించపరుచుకుంటాం.
మనకి మనమే సముదాయించుకుంటాం. 
విదేశీని విలువైనదిగా చూస్తూ,
స్వదేశీని చతికిలపడేస్తాం.
రూపాయికి రూపం తీసేస్తూ,
డాలర్ కి దాసోహం అనేస్తాం.
మన పతనానికి మనమే కారకులమై
ప్రభుత్వానికి మాత్రం చురకలంటిస్తాం.
ఎంతయినా మనం భారతీయులం.
బానిసత్వం  మన  వారసత్వం. 
****************************
written by BODDU MAHENDER
at 8.30pm, 4.9.2013

Saturday, 31 August 2013

అబ్బో అబ్బో అబ్బో ...

అబ్బో అబ్బో అబ్బో ...
ఉల్లి చారు చేసినారు..
ఉల్లి బజ్జి వేసినారు.
ఉచితముగా ఉల్లిగడ్డ
బహుమతిగా యిచ్చినారు..
అబ్బో..అబ్బో..అబ్బో..
రాజులే అయ్యి ఉంటరు.
రత్నాలతో కొని ఉంటరు.
 రోజు రోజు ఇరగ వండి
రొయ్య మీసం తిప్పుతుండ్రు..
అబ్బో.. అబ్బో..అబ్బో..
రాకాసి కాలమొచ్చే..
ఉల్లిగడ్డకి కరువొచ్చే..
మురిగిపోయిన గడ్డ కూడా
ముత్యమంత పిరమాయే..
అబ్బో.. అబ్బో.. అబ్బో..
******************************
written by BODDU MAHENDER
at 8:24pm 31.8.2013

Wednesday, 14 August 2013

కొనలేం.. తినలేం..

కొనలేం.. తినలేం..
అందని ద్రాక్ష పుల్ల అనలేం..
మానలేం..మారలేం..
మార్కెట్ ధరలతో ఇక వేగలేం..
అయినా తిట్టలేం..కొట్టలేం..
విమర్శలతోనే బ్రతుకు నెట్టలేం..
పండగ పూటా పస్తులుండే సంస్కృతి మనది..
ఇక ప్రతి పూటా పండగే అనుకుంటే బాధేముంది 
హాహా.. సామాన్యుడి బ్రతుకు చిత్రం ఎప్పుడూ ఇంతే.
సర్కారు వారి పాలనా తీరూ మారదు అంతే.
*******************************
written by BODDU MAHENDER
at 10:10am 15.8.2013

Wednesday, 17 April 2013

అందుబాటు ఆభరణమై అలరించి పోవుమా..

కొనాలా?వద్దా?
కొండ దిగిందా? కొంప ముంచిందా?
ఏమనుకోను?ఎలా సర్దుకోను..?
బంగారమా...భారమై పోకుమా...
నేల దిగి మా పుట్టి ముంచి పోకుమా..
నిల్వలన్నీ నీటి మూటలు చేయకుమా..
కొన్నవారి గుండెలకి కోతపెట్టి పోకుమా..
అలా అని ఆకాశానికే  ఎగబాకకుమా..
అందుబాటు ఆభరణమై అలరించి పోవుమా..
*********************************
written by BODDU MAHENDER
at 9:20pm , 17.4.2013

Wednesday, 13 March 2013

ఓ కలమా.. కళల మాయాజాలమా..

అక్షరాన్ని దిద్దిస్తావు..
అంగరక్షణ గావిస్తావు..
అజ్ఞానాన్ని అంతమొందించి..
అన్యాయాన్ని తుదముట్టించి..
ఆత్మ విశ్వాసం  పెంచేస్తావు..
ఆర్ధ్రంగా మదిని పిండేస్తావు..
ఓ కలమా..
కళల మాయాజాలమా..
కవికి బాసట నీవే..
కన్నీటికి ఊరట నీవే.. 
పాత్రికేయుడి ఆయుధమవుతావు
ప్రజా బంధుకు  గొంతుకవుతావు
మనసుని విప్పే యంత్రమవుతావు
చదువుని చెప్పే తంత్రమవుతావు 
ఓ కలమా...అధికార దర్పం నీదే..
అంతరంగాన్ని తాకే మార్గం నీదే..
*********************************
written by BODDU MAHENDER
at 10:16pm 13.3.2013 

Wednesday, 9 January 2013

ఎందుకు చంపాలి..?


మతం వేరైనందుకు  చంపాలా..?
మనవాడే అన్నందుకు  చంపాలా..?
ఎక్కువ ఉన్నారని చంపాలా..?
ఏమి చేయరులే అని చంపాలా..?
ఎందుకు చంపాలి..? ఏం చేసారని చంపాలి..?
చంపితే కానీ స్వర్గం రాదని ఏ మతమైనా చెప్పిందా..?
ఛీ..కొడితే గానీ జ్ఞానం రాదని హిత బోధేమైనా చేసిందా..?
ఎందుకు ఈ ఆవేశం..? దేనికోసం ఈ ఆక్రోశం..?
 శవాల గుట్టల్లో సంతోషంగా ఉండగలరా..??
సాటివాడి కన్నీళ్ళతో..సంబరాలు చేసుకోగలరా..??
ఆలోచించండి..ఆత్మ సాక్షిగా వివేచించండి..
మనిషిగా మనమంతా ఒకటే భాయి..
మానవత నశిస్తే మనుగడే లేదోయి..
******************************
written by BODDU MAHENDER
at 4:22pm 9.1.2013

Sunday, 6 January 2013

అర్ధం చేసుకోండి..ఆలోచించండి..


మీ ఉన్నతి, ఉద్యోగం అని మీరు... 
మీ సాంగత్యం, సాన్నిహిత్యం అని మేము..
కలల ప్రయాణంలో కలతల దరి చేరుతున్నాం ఇద్దరం..
మీకైనా ఉందా..కాస్తయినా సంతృప్తి, సంతోషం..
మాకైనా ఉందా..మీదైన లాలన , పాలన..
సుఖాల కోసమని నరకాన్ని తెచ్చుకుంటున్నాం..
విలాసాల కోసమని విషపు కోరల్లో చిక్కుకుంటున్నాం..
విలువ తగ్గ్గే డబ్బు కోసం..
మన విలువలని కోల్పోతున్నాం..
ప్రేమ పంచే బంధాల్ని దూరం చేస్కొని,
పేలవంగా గడుపుతున్నాం..
అర్ధం చేసుకోండి..ఆలోచించండి..
బంధాల్ని తెంచే బాధ్యతల కన్నా..
బాధ్యతగా మెలిగే బంధమే మిన్న..
ఇదే సత్యం...నిత్యం.. 
******************************
written by BODDU MAHENDER
at 10:30am 7.1.2013

Saturday, 5 January 2013

లేదు..లేదు..లేదు..


ఎందుకు బయటికి రావాలి..
ఏది అభివృద్ధి అనుకోవాలి..
ఎక్కడ నా స్వేచ్ఛని వెతకాలి..
ఏమని నేను చెప్పుకోవాలి..
స్త్రీగా పుట్టడమే శాపమా..?
భరించి ఉండటమే నేరమా..?
ఎందుకు నాకీ శిక్ష.. వేరుగా చూసే వివక్ష..?
నాదైన కళ లేదు..నాకంటూ ఓ కల లేదు..
నిర్ణీతమైన ఆశా లేదు..దానికి ఏ అండా లేదు..
లేదు..లేదు..లేదు..
ఏమున్నా నే చెప్పే వీలు లేదు..
చేసే వీలు అంతకన్నా లేదు..
ఇక ఎప్పుడు నా గతి మారుతుంది..
ఇంకెలా ఈ దుస్థితి వీడుతుంది..?
***************************
written by BODDU MAHENDER
at 1:25pm 5.1.2012

Saturday, 29 December 2012

దయచేసి నన్ను ఈ బాల్యం దాటనివ్వకు..


పుట్టినందుకు సంతోషపడుతారు అందరు..
పుట్టి బయటపడినందుకు సంతోషపడుతున్నా నేను..
ఆటలాడి ఆనందిస్తారు అందరు..
ఆటబొమ్మగా మారనందుకు ఆనందిస్తున్నా..నేను..
ఓ దైవమా..
నువ్వు అనే వాడివి నిజంగా ఉంటే,
 దయచేసి ఈ బాల్యంలోనే 
నా జన్మంతా గడిచిపోనివ్వు..
ప్రాయం తీసుకొచ్చి పరువాలు చూపించి
ఈ ప్రజానీకంలో నన్ను ఓ అంగడి బొమ్మ చేయకు..
కామం మత్తు ఎక్కించి, కర్కశాన్ని రెట్టించి 
ఆ పశు వాంఛలకి నన్ను బలిచేయకు..
పది జన్మలకి సరిపడే బాధని శాపంగా ఇవ్వకు..
బానిసగా అయిన బ్రతికేస్తా గానీ,
బలి కోసం పెంచే పశువుగా మాత్రం కాదు..
దయచేసి నన్ను ఈ బాల్యం దాటనివ్వకు.. 
బజారులో నా దేహాన్ని వేలం వేయకు..
********************************
written by BODDU MAHENDER
at 2pm 29.12.2012

Friday, 28 December 2012

జై గుంపులో గోవిందయ్యా..


జై గుంపులో గోవిందయ్యా..
నీ దారి నీదే..నీ మాట నీదే..
ప్రగాల్భాలకి కంచు కోట.. ఆచరణలకి నీటి మూట..
అన్నిట్లో ఘనుడివే...అనుయాయుడిగా మేటివే..
అధినేతగా మాత్రం శూన్యుడివే..అందరిలో నువ్వొక్కడివే..
అవినీతి అంటావు..అత్యాచారం అంటావు..
ఆవేదన అంటావు..అల్లకల్లోలం సృష్టిస్తావు..
ప్రతినలు చేస్తావు..ప్రయోజనాలు చెప్తావు..
పరిపరి విధాల పరిమితులు గీస్తావు..
మరి ఎందుకు ఎప్పుడు నీ పేరు ముందు రాదు..?
ఎందుకు ఎప్పుడు ఈ ఘోరాల్ని ముందుండి ఖండించవు..?
చరిత్రలో మాత్రం మన పేరుండాలి..చెరగని ఖ్యాతి మనదవ్వాలి..
నాయకులని నిలబెట్టి నిండా ముంచాలి.. 
ఆ అనుసరణలో నీ ఆధిపత్యం చెలాయిస్తుండాలి..
హాహాహా ..
జై గుంపులో గోవిందయ్యా..జై జై గుంపులో గోవిందయ్యా ..
లౌక్యం అంటే నీదిరా.. లాలూచీ లో మొనగాడివి రా..
************************************
written by BODDU MAHENDER
at 11:28am 29.12.2012

Saturday, 1 December 2012

మేలుకో..నీలా మరొకరు బలి కాకుండా పూనుకో..


తెలిసే తెలియకో ముచ్చట పడ్డావు..
వయసు వేడిలో ఓ ఊబిలో పడ్డావు..
బయటకొచ్చే మార్గం లేదు..
నీ బ్రతుకు నిలిచే అవకాశం లేదు..
కామం నీ కళ్ళు గప్పితే..
అది నీ దేహానికే బట్టగప్పింది..
ఇపుడు దు:ఖిస్తే ఏం లాభం లేదు..
ఎవరినో నిందిస్తే ఏ ప్రయోజనమూ లేదు..
మేలుకో..నీలా మరొకరు బలి కాకుండా పూనుకో..
నీ అనుభవం...వేల మంది అజ్ఞానుల్ని చైతన్యపరచాలి..
రోదిస్తున్న ప్రతిక్షణం.. సుఖరోగాల పీడనపై అవగాహన తేవాలి..
*********************************
written by BODDU MAHENDER
at 1:15pm 1.12.2012

Thursday, 25 October 2012

ఈ మట్టిలోనే నన్ను కప్పేస్తున్నా..


నను కన్న
తల్లిని మోసిన నేల ఇది..
తండ్రిని పెంచిన నేల ఇది..
ఇక్కడ వీచే గాలిలో అనురాగముంది..
పారే గంగలో ఆత్మీయత ఉంది..
అన్నిటికీ మించి నాకీ నేలతో అనుబంధముంది..
మట్టి మనిషిగా పెరిగాను..
మట్టిని మనసుతో తడిమాను..
పట్టెడన్నం మీకు ముద్ద పెట్టి..
పాడె మంచంలో నా గుండెను పెట్టి..
పని కెళ్ళాను.. పైరు పెంచాను..
పంట పండితే పండగ చేసుకున్నాను..
అలాంటి ఈ నేల తల్లిని విడిచి రమ్మంటే,.
వలసపోయి వండి వార్చుకొమ్మంటే..,
మనలేక , నా మనుగడనే ఆపేస్తున్నా..
ఈ మట్టిలోనే నన్ను కప్పేస్తున్నా..
***************************
written by BODDU MAHENDER
at 10:15pm 25.10.2012

Tuesday, 25 September 2012

ఎంత స్వార్ధం, ఎంత ద్రోహం..!!


ఏళ్ళ కొద్దీ శ్రమిస్తాం..
రోజులకొద్దీ పరీక్షలు రాస్తాం..
గంటలకొద్దీ ప్రార్థిస్తాం..
కొలువు వచ్చాక మాత్రం..
నిమిషాల కొద్దీ పని చేస్తాం..
ఎంత స్వార్ధం, ఎంత ద్రోహం..!!
ఉద్యోగ భద్రత చూసే నువ్వు..
దాని బాధ్యత మాత్రం మరిచావేం..??
సర్కారు సౌకర్యాలు చూసే నువ్వు..
సమర్ధ నిర్వహణ అక్కర్లేదంటావేం..?
ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు..
నీ తప్పులు తెలుసుకోవా ఏం..?
కన్నీళ్లు తుడిచే ముందు..
కంట్లో నలుసు తీయవా ఏం..??

మార్పు కోరుకునే వాడివి ..
ఆ మార్పు నీ నుండే ప్రారంభామవ్వాలని  తెలుసుకో..
మరో ప్రపంచం కావాలనుకునే వాడివి..
ఆ మంచి నీతోనే మొదలయ్యేలా మసలుకో..
****************************
written by BODDU MAHENDER
at 7:21am 21.9.2012

Monday, 10 September 2012

ఆత్మహత్యల్ని నివారించండి..


ఆత్మహత్య ఒక పరిష్కారం కాదు..
ఒక ప్రశ్న 
చనిపోయే వ్యక్తి మౌనంగా మన ముందు 
నిలిపే శేష ప్రశ్న..
ఆ ప్రశ్నకి జవాబు తెలిసినా..
చెప్పలేని స్థితిలో ఉన్నాం మనమంతా..
ఎందుకంటే అది వేలెత్తి చూపేది 

మనల్నే కాబట్టి..

అందుకే ఇబ్బంది పడి చెప్పే జవాబుని 
దాచడం కన్నా..
ఇబ్బంది పెట్టే ఆ ప్రశ్ననే 
తొలగించడం ఎంతో మిన్న..
ఆలోచించండి.. ఆత్మహత్యల్ని నివారించండి..
మిమ్మల్ని మీరు ప్రేమించండి..
మీ తోటి వారికి సహకరించండి..
*************************

written by ME
at 9:45pm 10.9.2012

Wednesday, 1 August 2012

ఇంకెందుకీ వర్గ వైషమ్యాలు..


కలిసే మనసులకి కులముందా..?
జతపడే హృదయాలకి జాతి ఉందా..?
పుట్టుమని పుడమి ఆజ్ఞ ఇస్తుందా..?
చంపమని మతం బోధ చేస్తుందా..?
ఇంకెందుకీ వర్గ వైషమ్యాలు..
ఒకరినొకరు హింసించుకునే తారతమ్యాలు..
కలిసి ఉంటే కలదు సుఖం..
కలహించుకుంటే తీరదు దు:ఖం.. 
************************
written by ME
at 8:45pm 1.8.2012

Saturday, 21 July 2012

మనమైనా మనలాగా ఉందాం..


కలిసే ఉందాం ప్రతి కొమ్మలో,కోనలో
కలిసే తిందాం ప్రతి పూటలో,పేటలో
మనకొద్దులే కులమతాంతరాల జాడ్యం 
అది మానవులనుకునే మృగాల మౌడ్యం
మనకొద్దులే అక్రమార్జనల ఆశలు
అవి మేక వన్నె పులుల ధ్యాసలు
మనమైనా మనలాగా ఉందాం..
నలుగురిని నవ్విస్తూ,నవ్వేస్తూ..
ఈ మనుషులకి ఒక గుణపాఠం అవుదాం.
ప్రేమలో..ఇకిలిస్తూ..వెక్కిరిస్తూ..
************************
written by BODDU MAHENDER
at 8:30am 21.7.2012

Tuesday, 17 July 2012

భూమిని నిండా ముంచకు..


ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రళయమే వస్తుంది..
ప్రతి జీవి మనుగడ ప్రమాదంలో పడుతుంది..
అందుకే,అలక్ష్యం చేసి అన్నీ కలుషితం చేయకు..
భూతాపం పెంచి,భూమిని నిండా ముంచకు..
**********************************
written by BODDU MAHENDER
at 12:20pm 17.7.2012

Monday, 25 June 2012

మాలో నిలిచిన సుగుణాలే బాసటగా...


కన్న బంధమొకటే లేదు గాని..
కంటి పాపగా చూసుకునే అనుబంధాలెన్నో..
కలకాలం తోడుగా నిలిచే స్నేహ గంధాలెన్నో..
ఆశలు తీరే అవకాశాలే కరువు గాని..
సానబెడితే మాలో మెరిసే రత్నాలెన్నో..
వెన్నుతడితే వెలికివచ్చే ముత్యాలెన్నో..

మాకు మేమే అవుతాము అన్నిటా..
మాలో నిలిచిన సుగుణాలే బాసటగా...
ఏ ఆధిపత్యమూ లేదు మాలో ఆత్మవిశ్వాసానికి..
ఏ అంతరమూ లేదు మాలో సాన్నిహిత్యానికి..
ఏ అవకాశాన్ని మేము వదలం..
ఏ ఆపదకీ మేము బెదరం..
స్వశక్తి పైనే మా ఆసక్తి..
స్వావలంబనకే మా అనురక్తి.. 

పేరుకే మేము అనాధలం...
కర్కశుల పాపాలకి ప్రతీకలం..
నిజానికి మేమే నవ చైతన్యానికి వారధులం...
నిస్తేజాన్ని పారద్రోలే ఆ రవికిరణాల సారధులం...
*********************************
written by ME
at 5:51pm 25.6.2012