Showing posts with label తెలుగు భాష పై కవితలు. Show all posts
Showing posts with label తెలుగు భాష పై కవితలు. Show all posts

Thursday, 29 August 2013

నా భాష.. నా మాతృభాష..

తను నాకు 
మాట నేర్పింది.. మమత నేర్పింది..
మనసు చూపింది..మధురమయ్యింది..
అంతులేని భావాల్ని బందీ చేసింది..
అక్షరక్షరాన వాటిని ఆవిష్కృతం చేసింది.
అవును.. తను నాకు
బాట చూపింది.. బాసటగా నిలిచింది..
భవిష్యత్తునిచ్చింది..బంగారమయ్యింది..
అదే ఎవరో మరెవరో కాదు 
నా భాష.. నా మాతృభాష..
ఖండాంతరాల ఖ్యాతినొంది
నేడు ఖండితమైపోతున్న తెలుగు భాష..
పాశ్చాత్య మోజులో పడి
పలకడానికి కూడా సిగ్గుపడిపోతున్న
పదహారణాల మన తెలుగోడి ప్ర‘యాస’..
********************************
written by BODDU MAHENDER
at 7:28pm 29.8.2013

Sunday, 23 September 2012

అమ్మంటి తెలుగు భాష........


అమ్మా అనే పిలుపులో ఎంత అనురాగముందో,
అమ్మంటి తెలుగు భాషలోనూ అంతే ఆప్యాయతుంది.
ఆదరిస్తుంది..అక్కున చేర్చుకుంటుంది..
ఆలోచనలకి మాటలు నేర్పుతుంది..
అందుకే..,
ఆంధ్రభోజునిచే కీర్తించబడింది..
ఆంగ్ల పండితులచే శ్లాఘించ బడింది..
ఆంధ్ర రాష్ట్రాన్నే ఏర్పాటు చేయించింది..
అఖిల భారతావానికే ఆదర్శప్రాయమైంది..

జయహో జయహో ఆంద్ర జన భాష..
జన్మ పావనమే చేయు నా జనని భాష..
**************************
written by BODDU MAHENDER
at 5:30am 17.9.2012

Sunday, 18 December 2011

ఇదేనా తెలుగోడి ఆత్మ గౌరవం..??

ఒకప్పుడు...
మదరాసి గా వద్దని 
మన వాసిని పెంచాలని 
తెలుగు భాష పేరిట 
ఉద్యమాలు చేశాము..రాష్ట్రాన్ని పొందాము ..
తరాల చరిత మనదని ..
తరగని ఘనత తెలుగుదని చెప్పి 
పాట్లెన్నోపడ్డాము..ప్రాచీన హోదా పొందాము 
సాహిత్య ప్రక్రియల్లో ..
అవధానాలు ,పద్య నాటక సొబగులు 
తెలుగుకే సొంతమని..
సగర్వంగా చాటాము..స్వాభిమానము
చూపాము 
మరి ఇపుడు ...
తెలుగే వద్దని ..దానికి తెగులు పట్టిస్తున్నాము ..
పలకడానికి వెనుకాడుతూ..పాడె కట్టిస్తున్నాము ..
మహనీయుల కృషి మట్టిలో పూడ్చేస్తూ ..
సాహితీ వైభవాన్ని గంగలో కలిపేస్తున్నాము..

ఇదేనా మన తెలుగోడి ఆత్మ గౌరవం ..??
ఇదేనా మన మాతృ భాష మమకారం ..??
********************************
written by ME
at 11am 17.3.2011

Saturday, 3 December 2011

తెలుగు తెలుగు తెలుగు........

నన్నయ పలుకుల తీయదనం తెలుగు
పోతన తళుకుల నిండుదనం తెలుగు
వేమన చమక్కుల కమ్మదనం తెలుగు
కాళోజి చురుక్కుల ఉప్పదనం తెలుగు
శ్రీ శ్రీ చెణుకుల వెచ్చదనం తెలుగు
ముళ్ళపూడి కిసుక్కుల చల్లదనం తెలుగు

తెలుగు తెలుగు తెలుగు........
పలుకు పలికినంతనే మమకారం కలుగు
పరవశంతో ప్రతి హృదయం ఉప్పొంగు

విశ్వనాధ వారు వేయి పడగలుగా రాసినా
సినారె విశ్వంభర గా చూపినా
అదంతా మన జ్ఞాన పీటాలకి మచ్చు తునకలే
మన తెలుగు భాష మధురిమలకి నిజ ప్రతీకలే

అందుకే ప్రతి ఒక్కరం
పలుకుతూ.. పటిస్తూ..
ప్రతి ఒక్కరికీ పాటాలుగా బోధిస్తూ
తెలుగు వెలుగులకై కృషి చేద్దాం
తెలుగు భాషా సొబగులని
తర్వాతి తరాలకి అందిద్దాం
************************
written by ME,
at 8am 2.5.2011
************************
ఈ కవిత ఈనాడు పేపర్ ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ లో
మే 10, 2011 నాడు ప్రచురితమైనది..

Friday, 2 December 2011

అప్పుడే మన తెలుగు భాష ..

ఇప్పుడు కావాల్సింది..
ఆవేదన కాదు ...ఆలోచన 
తెలుగు భాషాభివృద్ధి పై కాస్త విచక్షణ 
ఇప్పుడు వీడాల్సింది...
ఆంగ్లాన్ని కాదు ..అన్య భాషా మోజు ని 
మాతృ భాషకి పట్టిన నిర్లక్ష్య బూజుని
ఇప్పుడు చేయాల్సింది.. 
ప్రచారం కాదు ..ఆత్మ సాక్షిగా ఓ ప్రతిన 
మీ పిల్లలకు విధిగా మాతృ భాషా భోధన 
అప్పుడే, 
మన తెలుగు భాష 
కనిపిస్తుంది ..వినిపిస్తుంది 
నిండైన ప్రాభవంతో 
చిరకాలం నిలబడుతుంది..
*************************
written by ME,
at 10:30pm, 11.3.2011
**************************
ఈ కవిత ఈనాడు పేపర్ ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ లో మార్చి 15 ,2011 నాడు ప్రచురితమైనది

మాతృ భాష పై మమకారం చూపరా..

మన భాషే మనకు లోకువ అయితే 
ఆంగ్ల భాష యే లోకం అయితే 
మనదైన సంస్కృతి మనగలుగుతుందా ..?
మనసైన సాహిత్యం ఇక వెలువడుతుందా ..?

ఆత్మీయత పలుకులను వొదిలి ,
అరువు తెచ్చిన భావాలను చిలికితే 
అది గుండె లోతుల్ని తాకుతుందా ..?
మన నిండు భావనలను చెబుతుందా ..?

జాతి పిత " ఆత్మ కథ"ని రాసింది..
విశ్వకవి " గీతాంజలి "ని రాసింది ..
వారి మాతృ భాషలోనే కదా ..!!
చైనీయులు ఆధునికతకు మారినా.. 
జపనీయులు సాంకేతికంగా ఎదిగినా ..
వారి వారి భాషల్ని విడిచారా..?

మన భాషపై మక్కువతో 
"బ్రౌన్" నిఘంటు రచన చేసాడు 
కృష్ణదేవరాయలు "లెస్స" అని పలికాడు ..
విదేశీయులే కీర్తించిన గొప్ప భాష మనదిరా.. 
తెలుగు పలకడానికి నేడు నామోషీ యేలరా..

మాతృ దేశ అభిమానమే కాదు ..
మాతృ భాష పై మమకారం చూపరా..
తెలుగు భాషలో పలుకుతూ ..
మన ఆత్మ గౌరవాన్ని చాటారా...
***************************
written by ME,
at 8am, 12.2.2011
***************************
ఈ కవిత ఈనాడు పేపర్ ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ లో
ఫిబ్రవరి 22 ,2011 న ప్రచురితమైనది...