Wednesday 4 January 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..పార్ట్ 2

 
మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..

సమీక్ష.. విమర్శ... విశ్లేషణ...

- బొడ్డు మహేందర్, చెన్నూరు.

ఫోన్ 9963427242

Part-2

విషయానికొస్తే ఏ జిల్లా చరిత్ర అయినా దాని ప్రాదేశిక నైసర్గిక స్వరూపం, దాని పూర్వాపరాలతో మొదలవుతుంది. అందుకు విరుద్ధంగా ప్రముఖ పాత్రికేయుడు కొమ్మెర రామమూర్తి రాసిన   "ప్రాణహిత నదీ తీరం - శిలాజాలకు నిలయం" అన్న వ్యాసంతో ఈ పుస్తకం మొదలవుతుంది. వాస్తవానికి జిల్లాలో ప్రాణహిత కన్నా గోదావరి నది విస్తీర్ణం , ప్రవాహ దూరం ఎక్కువ. అయినా కూడ ఎవరూ గోదావరి నదీ విశిష్టత, దాని ప్రవాహ దూరం, ప్రాచీన, పురాణ చరిత్ర వంటివి రాయాలని పట్టించుకోలేదు. ఇక ఈ ప్రాణహిత వ్యాసం విషయంలోనూ జిల్లాలో అది వేమన పల్లి మండలం కల్లంపల్లి నుండి కోటపల్లి మండలం దేవుల వాడ దాక ప్రవహిస్తుంది అన్న ప్రాథమిక విషయం గానీ గోదావరి నదికి అతి ముఖ్యమైన పెద్ద ఉపనది ఇదన్న సంగతి గానీ రాయలేదు. ఇక ఆ నది పుట్టుక, విస్తీర్ణం తదితర విషయాల ప్రస్తావన అసలే లేదు. వ్యాసంలోని విషయం పరిశీలించినా కూడ అది ఒక 2 పేజీల వరకు సవ్యంగానే సాగినా ఆ తర్వాత మళ్లీ చరిత్ర పురాతన ఆలయాలు, విగ్రహాలు జాతర అంశాల వైపు మళ్ళింది.

2వ వ్యాసం జిల్లాలో హెల్త్ ఎడ్యుకేటర్ గా విధులు నిర్వహిస్తున్న అల్లాడి శ్రీనివాస్ రాసిన "జిల్లా నైసర్గిక స్వరూపం - సరిహద్దులు." సూటిగా చెప్పాలంటే నమస్తే తెలంగాణ దినపత్రిక మార్చి 2022 లో నిపుణ శీర్షికన ప్రచురించిన "తెలంగాణ నైసర్గిక స్వరూపం" అంశాల నుండి మంచిర్యాల జిల్లా కు సంబంధించిన బిట్లన్ని కలిపితే ఈ వ్యాసం. పెద్దగా కష్టపడకుండా , వాస్తవాల పునః పరిశీలన లేకుండా రాసిన ఈ వ్యాసంలో మంచిర్యాల జిల్లా గోదావరి బేసిన్ కిందకు వస్తుంది అన్న సమాచారాన్ని కోట్ చేయడం మర్చిపోయారు. ఉష్ణోగ్రత గురించి రాసినప్పుడు వర్షపాతం గురించి కూడ రాయాలని జ్ఞాపకం రాలేదేమో. బహుశా ఆయన స్వంత జిల్లా జగిత్యాల గుర్తొచ్చిందేమో.. జిల్లా సరిహద్దుల్ని ప్రస్తావిస్తూ జగిత్యాల కి ఉత్తరాన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయనీ పేర్కొన్నారు. ఇక అవసరం లేకున్నా శిలాజాల  గురించి పేర్కొన్నారు కానీ ఈ ప్రాంత నైసర్గిక స్వరూపం గురించి పోటీ పరీక్షల పుస్తకాల్లో ఇంత కంటే మంచిగా ప్రామాణికంగా సమాచారం ఉంటుంది. కనీసం అందులో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకున్న బాగుండేది. సహజంగా మంచి కథకుడు అయిన వ్యాసకర్త జిల్లాలోని కథా సాహిత్యం గురించి రాయకుండా ఈ అంశాన్ని ఎంచుకొని, ఆ అంశాన్ని తన భార్యకి ఇవ్వడంలోనే ఓ ఎత్తుగడ ఉంది. అది ఆమె రాసిన వ్యాసం చదివినపుడు అర్థమవుతుంది. జిల్లా కోర్ కమిటీ సభ్యుడిగా కూడ ఉన్న ఈ వ్యాసకర్త తనకు దొరికిన సౌలభ్యాన్ని బాగానే వాడుకున్నట్లు అనిపిస్తుంది.

3వ వ్యాసం విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ రాసిన(సేకరించిన) "జిల్లాలోని మండలాలు - గ్రామాల పేర్లు" అసలు ఇది వ్యాసం అని కూడా అనలేం.కేవలం మండలాల వారీగా గ్రామాల పేర్లు పేర్కొని వదిలేశారు.  వ్యాస ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినం గురించి కూడ పేర్కొన్న రచయిత్రి మరి మంచిర్యాల జిల్లా ఏర్పడిన దినం గానీ, దాని ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి గానీ ఒక్క వాక్యం రాయలేదు. అది కదా ఒక మంచి వ్యాస రచనకు ముడి సరుకున్న అంశం. అది వదిలేసి కేవలం పేర్లన్నీ వరుసగా రాసేసి ఒక  రచయిత్రి సేవల్ని నామ మాత్రానికే పరిమితం చేశారా లేక ఆమెకు జిల్లా విషయాలపై అవగాహన లేనందువల్ల ఒక్క క్లిక్ తో దొరికే సమాచారాన్ని ఆమె పేరిట ముద్రించి ఆమెని కూడ చరిత్రలో నిలిపే ప్రయత్నం చేశారా ??  అసలు జిల్లా ఏర్పాటు పూర్వాపరాలు గురించి ఏ ఒక్క వ్యాసం లేకపోవడం ఈ పుస్తకం ప్రాథమిక పునాదులు లేకుండా నిర్మితమైంది అన్నదానికి సాక్ష్యం.

4వ వ్యాసం బెల్లంపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తెలుగు పండిట్ గా పనిచేస్తున్న గుర్రాల శ్రీనివాస్ రాసిన  "జిల్లా ఆదివాసీ, గిరిజన తెగలు". స్వయానా ఆదివాసీ అవ్వడం వల్లనేమో ఈ వ్యాసకర్త సాధికారికంగా 16 పేజీల ఈ సుదీర్ఘ వ్యాసంలో జిల్లాలోని 10తెగల సంస్కృతీ సంప్రదాయాల  గురించి ప్రధానంగా వివరణలిచ్చారు. చదువుతున్నప్పుడు వారి ఆచార వ్యవహారాలు తెలియడంతో పాటు జిల్లాలోని ఏ ప్రాంతాల్లో వారు ఉన్నారో మనకు అవగతమవుతుంది. ముఖ్యంగా ఆయా తెగల నాయకుల్ని అడిగి సమాచారం రాయడం బాగుంది. అయితే ఆదివాసీ తెగలన్నిటిని కలిపి కోయుతూర్ అనరు. కేవలం రాజ్ గోండ్లనే కొయుతూర్ అంటారు. వారి ప్రధాన దైవమైన నాగోబా, గురించి కూడ వ్యాసంలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. ప్రధాన్ తెగ పేరు పర్ధాన్ గా అచ్చు తప్పు పడింది. అలాగే గిరిజనులు అంతా కొలిచే పద్మపురి కాకో ఆలయం గురించి, ఆదివాసీల ఉన్నతికి "ఐటీడీయే" తోడ్పాటును గురించి కూడ రాస్తే వ్యాసం పరిపూర్ణంగా ఉండేది.

5వ వ్యాసం రాజకీయాలకు సంబంధించి ప్రముఖ పాత్రికేయుడు ఎం. డి. మునీర్ రాసిన "రాజకీయ కేంద్రం మంచిర్యాల". పేరుకి మంచిర్యాల అని ఉన్నా జిల్లాలోని ఆన్ని ప్రాంతాలని కవర్ చేస్తూ రాసారు కానీ ఒక క్రమ పద్ధతిలో ప్రాథమిక విషయాలని పేర్కొంటూ రాయకపోవడంతో ఈ వ్యాసం అంతా అస్తవ్యస్తంగా తప్పుల తడకగా మారింది. ఉదాహరణకు మొదటి పేరాలోనే సోషలిస్ట్ పార్టీ నుండి గెలిచిన  చెరకు మాధవరెడ్డిని టీడీపి ఎంపీ గా చేశారు అని రాశారు. చెన్నూరు మొదటి ఎమ్మెల్యే కోదాటి రాజమల్లు  అయితే గడ్డం వెంకటస్వామి అని రాశారు(ఇలాగే మడిపల్లి భద్రయ్య మన ఆదిలాబాద్ గ్రంథంలోనూ గడ్డం వెంకటస్వామిని చెన్నూరు ఎమ్మెల్యే అని తప్పుగా పేర్కొన్నారు). మరో చోట కోటపల్లి వాస్తవ్యుడు అయిన పురాణం సతీష్ ను మంచిర్యాల వాడని రాసారు. ఇవి పైపైన పరిశీలన చేస్తేనే కనిపించిన తప్పులు. ఇంకా ప్రాథమికంగా జిల్లాలో ఎన్ని శాసన సభ, లోక్ సభ స్థానాలు ఉన్నాయో పేర్కొనకుండా ఆయా విభాగాల వారీగా వివరించకుండా కలగాపులగం చేశారు. అసలు మన జిల్లా మొత్తం పరిధిలోకి వచ్చే పెద్దపల్లి లోక్ సభ స్థానం గురించి గానీ, ఆ ఎన్నికల వివరాల జోలికి గానీ పోలేదు. వ్యాసంలో వాక్య నిర్మాణాలు మరీ ఘోరం. దేన్ని భూత, వర్తమాన కాలాల్లో రాశారో చెప్పలేం. చరిత్ర కి ముఖ్యంగా కావాల్సింది తారీఖులు, సంవత్సరాలు. ఎవరు ఎప్పుడు ఏ కాలంలో పని చేశారో కాలక్రమేణా రాయకుండా వాళ్ళు పనిచేశారు, వీళ్ళు పని చేశారు అని రాస్తే ఇది ఎలా ప్రామాణికంగా నిలుస్తుంది.? వ్యాసంలో చివరి పేరా అయితే వ్యాస అంశానికి సంబంధం లేకుండా సామాజిక, తెలంగాణ ఉద్యమాల గురించి రాసారు. అసలు కమిటీలో  దీన్ని ఎవరైనా చదివారా, పునః పరిశీలన చేశారా.? రచయిత అయినా తాను రాసింది చూసుకున్నాడా అనిపిస్తుంది.

6వ వ్యాసం లక్షెట్టిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేదాళ్ళ రాజేశ్వర రావు రాసిన "జిల్లా జాతరలు". దాదాపుగా జిల్లాలోని అన్ని జాతరలని గురించి సూటిగా సంక్షిప్తంగా బాగా రాసారు. కానీ  కోటపల్లి మండలం జనగాం లో 3రోజుల పాటు జరిగే మధున పోచమ్మ జాతరని, చెన్నూరు లో జరిగే లక్ష్మీ దేవర బోనాల జాతర ను వదిలేసారు. అయితే కేవలం హిందూ జాతరలే కాకుండా లక్షెట్టి పేట సి.ఎస్.ఐ. చర్చి  ఆధ్వర్యంలో లో జరిగే యేసు పునరుత్థాన  జాతర గురించి రాయడం ప్రశంసనీయం. అయితే లక్షెట్టి పేట చర్చి తెలంగాణలో 2వ పెద్ద చర్చ్ గానీ దక్షిణాసియా లో కాదు. ఇది సవరించవలసి ఉంది. ప్రస్తుతం కొత్త కొత్త చర్చిలు పెద్ద ఎత్తున నిర్మితమవుతున్న కారణంగా( ఉదాహరణకు బెల్లంపల్లి దగ్గర్లోని కల్వరి ప్రత్యక్షత మందిరం ) పెద్ద చర్చీల వరుస క్రమం మారిపోయి ఉండొచ్చు. పరిశీలించవలసి ఉంది. అలాగే మతాలకతీతంగా పెద్ద ఎత్తున జరిగే చెన్నూరు, మంచిర్యాల తదితర ఉర్సు ఉత్సవాల గురించి కూడ రాస్తే బాగుండేది.

7వ వ్యాసం యువకవి బొలిషెట్టి నాగేంద్ర రాసిన  "జిల్లా పర్యాటక ప్రాంతాలు". ఎకో టూరిజం పై ఎక్కువ ఫోకస్ చేసినట్లున్న ఈ వ్యాసంలో కొన్నింటి గురించి దీర్ఘ వివరణలు ఇవ్వగా కొన్ని ఒక వాక్యంతో, మరికొన్ని పొడిపొడిగా రాసి వదిలేశాడు. చాలా వాటికి ప్రతి ఏటా జాతర, ఉత్సవాలు జరుగుతాయి అని పేర్కొన్నాడు కానీ ప్రత్యేకంగా సమయం(ఏ నెల) అనేది రాసి ఉంటే మరింత ప్రయోజనాత్మకంగా ఉండేది. ఎన్నో ఏళ్ల నుండి మంచి పిక్నిక్ స్పాట్ గా, కార్తీక వన భోజనాలు కేంద్రంగా ఉన్న భీమారం లోని జోడు వాగుల గురించి రాయనేలేదు. టెంపుల్ టూరిజం గురించి రాసినప్పుడు జిల్లాలో అతి ముఖ్యమైన గూడెం గుట్ట దేవాలయం గురించి రాయలేదు. అలాగే పారుపల్లి లోని కాలభైరవ ఆలయం, చెన్నూరు లోని ఉత్తర వాహిని గోదావరి ని ప్రస్తావిస్తే బాగుండేది. అన్నిట్లో అచ్చు తప్పులున్నట్టే ఇందులో కూడ చిన్నయ గుట్ట దండేపల్లి నుండి 18 కిమీ కి బదులు 8కిమీ దూరం లో ఉందని ముద్రించబడింది. ఇక ప్రత్యేకంగా పర్యాటక స్థలాలు కానటువంటి వేమనపల్లి వృక్ష శిలాజాలు , బొగ్గు బావులు, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ లని పర్యాటక స్థలాలుగా పేర్కొనడం సబబు కాదనిపిస్తోంది. ముఖ్యంగా వ్యాసంలో పేర్కొన్న చాలా వాటికి రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల పర్యాటకులకు కొంచెం ఇబ్బందే.

8వ వ్యాసం  ప్రస్తుతం జిల్లాలో సీనియర్ కవిగా పేరొందిన ముత్యబోయిన మలయశ్రీ రాసిన "జిల్లా పద్య సాహిత్యం". అయితే టైటిల్ కు తగ్గట్టు దీంట్లో పద్య సాహిత్యాన్ని, పద్య కవులందరి గురించి కాకుండా శతక సాహిత్యం అని మళ్లీ ఇందులో ఒక విభాగం ఏర్పాటు చేసి దానిని మరో యువ కవి(9వ వ్యాసకర్త) కి అప్పగించడంలో ఔచిత్యమేమిటో..వారికే తెలియాలి. పోనీ పద్య సాహిత్యం పేరుతో ప్రత్యేకంగా వ్యాసం రాసినా అందులో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. ఒకటిన్నర పేజీకి  తోకల రాజేశం రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథమే ఆధారం. ఒక పేరా యధాతధం. ఆ తర్వాత పేజీల్లో ఒకటి లేదా 2 వాక్యాల్లో కవుల పేర్లు, వారి గ్రంథాల ప్రస్తావన అంతే. కొందరి పేర్లు కూడ లేవు. మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం అని ముందే పుస్తకం పేరు అనుకున్నప్పుడు ఇలా మమ అనిపించే వ్యాసాలతో ఎవరికి ఉపయోగం? గోల్కొండ కవుల సంచిక లో జిల్లాకు సంబంధించి ఇద్దరు కవుల గురించి కాదు, మొత్తం 4 గురు కవుల పేర్లు, ముగ్గురు రచనల్ని  పేర్కొన్నారు. వానమామలై వరదచార్యులు వారి సోదరుడు వానమామలై జగన్నాథ చార్యుల(కొంత కాలం చెన్నూరు, భీమారం ప్రాంతాల్లో ఉన్నారు) పద్యాలు కూడా ఇందులో ఉన్నవి. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం... గోల్కొండ కవుల సంచికలో పేర్కొన్న కవి పేరు ఆరుట్ల రామాచార్యులు. రామానుజచార్యులు కాదు. బి.ఎన్. శాస్త్రి - ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం, మడిపల్లి భద్రయ్య - మన ఆదిలాబాద్ నుండి రెండేళ్ల కిందటి తోకల రాజేశం రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర వరకు అందరూ అదే తప్పుని కొనసాగించారు గానీ, ఏ ఒక్కరూ కూడ ఆ ఒరిజినల్ బుక్ ని చూసి,  ధృవీకరించలేదు. పునః పరిశీలన చేయలేదు. ఇప్పుడు ఈ వ్యాసకర్త కూడ ముందు రాసిన రచయితల పుస్తకం చూసేసి దాన్నే పునారుద్ఘాటించారు.  దీని వల్ల ఈ రచయితలందరూ వారికి తెలియకుండానే ఒక తప్పుడు చరిత్రను సృష్టించేస్తున్నారు. ఇక సేనాపతి రామాచార్యులు జన్మతః మాత్రమే చెన్నూరు కవి. ఆయన సాహిత్య పోషణ చేసింది స్థిర నివాసం ఏర్పరుచుకున్నది పెద్దపల్లి లో. ఆయన్ని కరీంనగర్ జిల్లా కవి గానే పేర్కొని అక్కడి చరిత్ర గ్రంథాలు వెలువడ్డాయి. కాబట్టి రాసేటప్పుడు వలస వెళ్లిన వారి గురించి వారు ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఉండే వారే తదితర విషయాలు చివరగా పేర్కొని... జిల్లాలో ఉంటూ ఇక్కడి సాహిత్యానికి కృషి చేసిన వారి గురించి విస్తారంగా రాసి ఉంటే జిల్లా ప్రత్యేక చరిత్ర లకు అర్థం ఉంటుందని నా అభిప్రాయం.

ఇక ఈ వ్యాసం చివరి పేరాలో వర్తమాన పద్యకవులు అని పేర్కొంటూ కవి కాని ఒకరిని ఏకంగా  పద్య కవిగా పేర్కొన్నారు. పునః పరిశీలన చేయకుండా అచ్చేసిన ఇలాంటి చిన్న చిన్న తప్పులే తర్వాతి తరాలకు తప్పుడు దిశా నిర్దేశం చేస్తాయి.

9వ వ్యాసం..యువకవి పెద్ది భరత్ రాసిన "జిల్లా శతక సాహిత్యం". ఒక విధంగా చెప్పాలంటే 8వ వ్యాసం ఉపోద్ఘాతం అయితే దానికి కొనసాగింపు ఈ వ్యాసం. 8వ వ్యాసంలోని కవి పరిచయ ఏక వాక్య తీర్మానాలే ఇందులో వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగ ఉంటాయి. కాకపోతే ప్రతీ ఒక్కరి గురించి రాసిన విశ్లేషణ సంక్షిప్తంగా అయినా బాగుంది. అవధానులు గురించి చెప్తూ జిల్లాలో 2వ వారు, 3వ వారు అని చెప్తూ మొదటి వారు ఎవరన్నది రాయడం మర్చిపోయారు. అసలు 3వ అవధాని, తొలి శతావధాని  అని కూడ పేర్కొన్న కవి గురించి 3,4 వాక్యాలే రాశారు తప్ప ఆయన పుస్తకాల్లోని అంశాల వివరణలలోకి వెళ్ళలేదు. అలాగే ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం వల్ల అక్షర దోషాలు కన్పిస్తాయి.  2,3 చోట్ల కవులకి సంబంధించిన సమాచారం పునరుక్తమవుతుంది. ఇక నీర్ల మధనయ్య రాసిన 3వ శతకాన్ని 2వది అని తప్పుగా పేర్కొన్నాడు. అయితే ఇప్పటివరకు రాసిన వ్యాసకర్తలతో పోల్చుకుంటే కొంచెం సాహిత్య లోతుపాతులు తరచి, ఆయా పుస్తకాలు చూసి రాసినట్టు అనిపిస్తుంది. చాలా మంది శతక కర్తల పేర్లు పేర్కొన్నాడు కానీ వాటికి ఆధార గ్రంథాలు గానీ, ఆ సమాచారం ఎక్కడ లభ్యమైంది అన్నది గానీ రాయలేదు. రాసి వుంటే తర్వాతి సాహితీ పరిశోధకులకు ప్రయోజనకారీగా ఉండేది.

10వ వ్యాసం ప్రముఖ కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తోకల రాజేశం రాసిన "జిల్లా వచన కవిత్వం". పుస్తక కోర్ కమిటీ మెంబర్ కూడ అయిన ఈ వ్యాసకర్త అంతకు ముందే జిల్లా సాహిత్య చరిత్ర రాయడం వల్ల సులువుగానే వ్యాసాన్ని రాశాడు అనిపిస్తోంది. కాకపోతే ఈ జిల్లాకు సంబంధించి పుస్తకం కాబట్టి వేరే ప్రాంతాల వారి (ఉదా..డాక్టర్ చెమన్ సింగ్) సాహిత్యం గురించి రాయకుండా ఉంటే బాగుండేది. అలాగే రాసిన కవుల గురించి సమతూకం పాటించకుండా కొందరి కవితల్ని ప్రస్తావిస్తూ విశ్లేషించిన ఈ కవి, మరికొందరిని రాయకుండానే ఒకటి రెండు వాక్యాలకు పరిమితం చేసాడు. ఇతరులవి కూడ అందుబాటులో ఉన్నప్పుడు రాస్తే బాగుండేది. అవకాశం దొరికింది కదా అని తనకు తాను గొప్పలకు పోకుండా అందరితో పాటు తన పరిచయాన్ని సంక్షిప్తంగానే రాసుకున్నాడు. అయితే కొందరి కవుల గురించి పునరుక్తాలు ఉన్నాయి. ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం వల్ల ఒక చోట పుస్తకం ముద్రించిన కవయిత్రిగా పేర్కొన్న ఆమె గురించే మరో చోట పుస్తకం ముద్రించ లేదని ఉంది. అలాగే కరోనా కాలం నుండి కవితలు రాస్తున్న అనేక మంది వర్ధమాన కవుల గురించి రాయలేదు. రెండేళ్ల తర్వాత వచ్చిన సాహిత్య పరిణామాలు, కొత్త కవులకి సంబంధించిన అప్డేట్ మిస్సయ్యి మళ్లీ తను రాసిన చరిత్రనే సంక్షిప్తంగా రాసినట్టు అనిపిస్తుంది.

ఇది 2వ భాగం మాత్రమే. ఇంకా 3 భాగాలు ఉంది. మరో 30 మంది రచయితల అసలైన/కాపీ చేసిన కృషి ఏంటో సాధికారికంగా చెప్తాను.

4 January 2023

No comments:

Post a Comment