Tuesday 27 December 2022

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..పార్ట్ 1

 

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..

సమీక్ష.. విమర్శ... విశ్లేషణ...

- బొడ్డు మహేందర్, చెన్నూరు.

ఫోన్ 9963427242

"సింహాలు తమ చరిత్రని అవి రాసుకోనంత కాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది" అని ప్రముఖ నైజీరియన్ కవి చినూవా అచెబే అన్న మాటలు తెలంగాణ చరిత్ర ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనం తరచూ వింటూనే ఉంటాం. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చి 8ఏళ్లు అయినా ఆ సోయి ఇంకా కొందరు తెలంగాణ మేధావులకు, కవులకు వచ్చినట్టు అనిపించడం లేదు. ఎవరు ఏది రాసినా, ఎక్కడి వారో వచ్చి పెత్తనం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం,తానా తందానా బృందంగా ఏర్పడటం, కడుపులో చల్ల కదలకుండా తమ పని చేసుకోవడం, తమ వరకే ఆలోచించుకోవడం తమ గొప్పతనంగా భ్రమపడుతున్నారు. కానీ సందర్భానుసారం లేని ఏ ప్రతిచర్య అయినా, రికార్డు కానీ ఏ వాస్తవమైనా తమనే కాదు, తమ తర్వాతి తరాలను కూడ  తప్పుడు మార్గంలో నడిపిస్తుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఈ మధ్యే డిసెంబర్ 10,2022న మంచిర్యాల లో అట్టహాసంగా జరిగిన "మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం" పుస్తకావిష్కరణ మరియు అందులోని విషయాలను పరిశీలించినప్పుడు మనకు ఈ ఉదాసీన నిర్లక్ష్య వైఖరే స్పష్టంగా కనిపిస్తుంది.

2020లో తెలంగాణ సాహిత్య అకాడమీ జిల్లాల వారీగా సాహిత్య చరిత్ర లు ముద్రించిన రెండేళ్ల పిదప, వాటిలోని లోపాలు పూరించాలనో లేక జిల్లా తొలి చరిత్ర గ్రంథాలకు రూపకల్పన చేయాలనో గానీ ఒక సత్సంకల్పంతో బృహత్ కార్యాచరణనే తలకెత్తుకుంది తెలంగాణ సారస్వత పరిషత్తు. ఇందుకు వారిని అభినందించాల్సిందే. 8 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఒక ప్రఖ్యాత సంస్థ నుండి "జిల్లా సమగ్ర స్వరూపం" పేరిట  పుస్తకాలు వస్తున్నాయంటే అవి ఎంత ప్రామాణికంగా ఉంటాయో, వాటి ద్వారా ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో అని ఆశించడం తప్పు కాదు. కానీ అందుకు విరుద్ధంగా ప్రామాణికత కాదు కదా, ప్రాథమిక విషయాలను కూడ రాయని ఒక పుస్తకాన్ని(వ్యాస సంకలనాన్ని) మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం పేరిట ముద్రించి అభాసుపాలయ్యింది ఆ పరిషత్తు. మరి ఇందుకు గల కారణాలు, ఆ పుస్తకంలోని లోటుపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒక్కో జిల్లాకు సంబంధించి అక్కడి స్థానిక కవులు,ప్రముఖులు, ఉపాధ్యాయులు కొందరిని ఎంపిక చేసి వారికే ఆ జిల్లా సమగ్ర స్వరూపం కి సంబంధించిన, రచన కూర్పు, వ్యాసాల సమీక్ష వంటి అన్ని బాధ్యతలు అప్పగించి, కేవలం ముద్రణ బాధ్యత మాత్రమే తీసుకుంది పరిషత్తు. కానీ ఈ కమిటీ ఎంపిక కి ఏ ప్రాతిపదిక తీసుకున్నారో చెప్పలేదు. కానీ స్థానిక ఆస్థాన భజన బృందాలకు పెద్దపీట వేశారని మాత్రం చెప్పొచ్చు. ఉదాహరణకు మన 

ప్రస్తుత జిల్లా గురించి కనీస అవగాహన లేని రెండేళ్ల కిందటే మంచిర్యాల జిల్లా కి బదిలీ పై వచ్చిన ఉపాధ్యాయుడు మరియు కవి రచయిత అయిన గోపగాని రవిందర్ ను ఈ గ్రంథ కూర్పుకు సంబంధించిన 6గురు సభ్యులతో కూడిన "జిల్లా కోర్ కమిటీ" కి కన్వీనర్ గా (మార్చి 5,2022) నియమించడం తోనే ఈ స్థానిక రచనల మౌలిక లక్ష్యం దెబ్బతింది. వ్యక్తిగతంగా సాహిత్య పరంగా ఆయన కృషిని తక్కువ చేయలేం కానీ ఒక్క జిల్లాకు సంబంధించి తొలి చరిత్ర గ్రంథ రచన కమిటీ కి ఇక్కడి వారినే కన్వీనర్ గా పెట్టడం కనీస నైతిక ధర్మం. ఎందుకంటే స్థానికులకు అక్కడి భౌగోళిక, చారిత్రక అంశాలపై కనీస పరిజ్ఞానం ఉంటుంది.  అది పాటించని పొరపాటు ఫలితమే ఈ అస్పష్ట అసమగ్ర పుస్తక స్వరూపం.ఇందులో ఆయన ఒక్కడిదే పూర్తి బాధ్యత కాకున్నా, జిల్లా కమిటీ పెద్దగా,సారస్వత పరిషత్తు అప్పజెప్పిన బాధ్యతలు, పెట్టిన కార్యాచరణ నియమాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో సమీక్షల ద్వారా, సమగ్ర పరిశీలనల ద్వారా చూసుకోవాల్సిన విధి నిర్వహణ తనదే కదా. అసలు పుస్తకం చూడగానే మొత్తంగా ఈ కమిటీ గానీ, కమిటీలోని ఏ ఒక్కరైనా గానీ ఒక్కసారైనా ఒకరి వ్యాసాన్ని అయినా చూసారా, చదివారా అన్న సందేహం రాక మానదు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం మొత్తం చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును పట్టి చూస్తే చాలు అన్న విధంగా ఇందులోని వ్యాసాలలోని అక్షర దోషాలు, అర్థవంతం లేని వాక్య నిర్మాణాలు, ఏ ప్రాతిపదికన పెట్టారో తెలియని కొన్ని వ్యాసాల రచన, మొత్తంగా ఒక క్రమ పద్ధతిని పాటించని వ్యాసాల అమరిక లోపాలు అన్నీ  ఒక్క "విషయ సూచిక" ని చూసినా తేటతెల్లమవుతుంది.

సశేషం..

ఇది కేవలం వ్యాసంలో మొదటి భాగం మాత్రమే తర్వాతి భాగాల్లో 10 మంది చొప్పున మొత్తం 40 మంది వ్యాసకర్తల రచనల పైన , వారి రచనా నైపుణ్యం పైన వరుసగా పోస్ట్ చేస్తాను. ముందుంది ముసళ్ల పండుగ.


tdorenSspo6bi78mui 1D1222g0i61igr7c3fl 24f6c4l05fme61m9ee0ui 

No comments:

Post a Comment