Wednesday 14 December 2011

సెకండ్ ఇన్నింగ్స్ ఉద్యోగాలు

పిల్లల్ని కనడానికో, పెంచడానికో, తల్లిదండ్రుల్ని చూసుకోవడానికో, సేవ చేయడానికో కొంతమంది ఉద్యోగినులు కెరీర్‌లో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంటుంది. బాధ్యతలు తీరిపోయాక మళ్లీ ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తే ఇంతకాలం ఖాళీగా ఉన్నారు కదా... చూద్దాంలే అంటూ దరఖాస్తులను పక్కన పడేస్తున్నాయి సంస్థలు. ఉద్యోగానుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ ఖాళీగా ఉండాల్సి వస్తున్న ఇటువంటి మహిళల కోసం కొన్ని కార్పొరేట్ కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. వాటిలో టాటా సంస్థ ఒకటి.

"టాటా గ్రూప్స్ ఏర్పాటుచేసిన సెకండ్ కెరీర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్‌సిఐపి) ద్వారా మహిళలు కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టొచ్చు. ఈ కార్యక్రమాన్ని 2008-09 సంవత్సరంలో మొదలుపెట్టాం. ఆ ఏడాది రెండు వేల దరఖాస్తులు వచ్చాయి. వాటినుంచి 34 మందిని ఎంపిక చేశాం. ఆ తరువాత 2009-10 లో వాటిసంఖ్య ఐదువేలకి పెరిగింది. వాటిలో 41 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది ఐదువేల దరఖాస్తుల పైనే వచ్చే అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న ఎంతోమంది మహిళలు పలురకాల కారణాల వల్ల ఉద్యోగాలను వదిలేస్తుంటారు.
           ఆ తరువాత ఉద్యోగాలు చేయాలని వాళ్లకున్నా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. సామర్ధ్యం ఉండి, నైపుణ్యం కలిగి మళ్లీ కెరీర్ మొదలుపెట్టాలనుకునే మహిళలకి పని కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఎస్‌సిఐపి ప్రోగ్రామ్. టాటా గ్రూప్ లైవ్ బిజినెస్ ప్రాజెక్టుల ద్వారా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇందుకు ఐదారునెలల సమయంలో దాదాపు 500 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు టాటా పవర్ అండ్ టాటా కాపిటల్‌లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి'' అని చెప్పారు టాటా గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ సతీష్ ప్రధాన్.

కెరీర్‌లో బ్రేక్ తప్పనిసరి..
                హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) కంపెనీ కూడా దాదాపు ఇలాంటి పద్ధతినే అనుసరిస్తోంది. అయితే ఆడవాళ్లకు మాత్రమే కాదు. మగ, ఆడ ఇద్దరికీ కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసిన తరువాత బ్రేక్ తీసుకుంటే బాగుండనిపించడం సహజం. అటువంటి వాళ్లకి బ్రేక్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది హెచ్‌యుఎల్. ఈ అవకాశాన్ని ఉద్యోగ కాలపరిమితిలో రెండుసార్లు వాడుకోవచ్చు. "ముఖ్యంగా మహిళా మేనేజర్ల గురించి ఆలోచించి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. జీవితంలో ప్రతీ దశను ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి అవకాశం తప్పక ఉండాలి.
                 అప్పుడే మహిళ లకి కుటుంబ జీవితాన్ని, కెరీర్‌ని బాలెన్స్ చేసుకోవడం సులభమవుతుంది'' అన్నారు హెచ్‌యుఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీనా నాయర్. ఈ రెండు సంస్థలే కాకుండా ఇండియన్ ఇంక్ అనే సంస్థ కూడా మహిళల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పించింది. పనిగంటల్లో వెసులుబాటు, ఇంటినుంచి పనిచేసే అవకాశం, శాటిలైట్ ఆఫీస్ పాలసీ, పిల్లల సంరక్షణ వంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ సంస్థలో

No comments:

Post a Comment