Monday 14 April 2014

సాందీపని హై స్కూల్

ఇది నేను చిన్నప్పుడు ఐదవ తరగతి వరకి చదువుకున్న పాఠశాల
-సాందీపని హైస్కూల్.
శ్రీరాంపూర్ కాలనీ(ఆదిలాబాద్ జిల్లా)లో ప్రగతి స్టేడియం పక్కన ఉంటుంది.నేను చదువుకునే సమయంలో కేవలం ఏడవ తరగతి వరకి మాత్రమే ఇక్కడ ఉండేది. అప్పట్లో స్కూల్ కరస్పాండెంట్ గా కిషన్ రెడ్డి సార్ ఉండేవారు. ఆయన భార్య పద్మ , ఆమె తమ్ముడు సుధాకర్ రెడ్డి స్కూల్ ఇన్చార్జిలుగా ఉండేవారు. నాకు రాజేందర్ సార్ అంటే ఇష్టంగా ఉండేది.ఆయన మాకు గణితం బోధించేవారు.ఐదవ తరగతి చదువుతున్న సమయంలో నవోదయ ఎంట్రన్స్ కోసం నాతో పాటు మరో ఇద్దరు స్నేహితులం కలిసి  ఆయన ఇంట్లోనే ఒక నెలరోజుల పాటు- ప్రతిరోజు సాయంత్రం వెళ్లి రాత్రి 10గంటల వరకి ఉండి చదువుకునే వాళ్ళం.
సహజంగానే నేను చురుకైన విద్యార్థిగా ఉండటం వల్ల ఉపాధ్యాయులు నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.నేను ఎప్పుడూ తరగతిలో మొదటి,రెండు ర్యాంకులు పొందేవాన్ని. నాకు పోటీగా కృష్ణవేణి అనే అమ్మాయి బాగా చదివేది.నేను ఫస్ట్ అయితే ఆమె సెకండ్.ఆమె ఫస్ట్ వస్తే నేను సెకండ్.ఇద్దరి మధ్య చదువు విషయంలో బాగా పోటీ ఉండేది.నాకు తెల్సిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆమె వైద్య విద్య అభ్యసించి, డాక్టర్ గా సేవలు అందిస్తుందట.
ఇక నాకు మిత్రులుగా సింగం భాస్కర్,ప్రవీణ్,శ్రీకాంత్,వెంకట కృష్ణ, భూసరి రమేష్, రామన్న,శ్రీనివాస్,విద్యాసాగర్ లు ఉండేవారు.స్కూల్ లో తోకల మమత అనే నా సహాధ్యాయినిని  తోక తోక అంటూ బాగా ఆట పట్టించే వాణ్ని. మనోహరి అనే అమ్మాయి కూడా బాగా చదివేది. అలాగే నాగుల మమత కూడా నాతో స్నేహంగా ఉండేది.వీరిద్దరి నివాసం అరుణక్క నగర్ లో మా ఇంటి పక్కనే ఉండటంతో చనువుగా ఉండేవాళ్ళం.

No comments:

Post a Comment