Tuesday, 17 April 2012

గులాబీల ఆశలు

వేల ఆశలతో విచ్చుకుంది ఓ పుష్పం ..
తన పరిమళ అందాలతో ,
ఈ మహిని మైమరిపించాలని..
నిర్మలమైన ప్రేమకి గుర్తుగా నిలవాలని,
మదిలోని భావాలకి వారధిగా ఉండాలని..
వాడిపోయే లోపే వలచిన హృదయంలో ,
శాశ్వతంగా ఒదిగిపోవాలని..

విప్పారిన పూరేకులతో, వర్ణమయ ఈ జగతిని చూస్తూ..
తనదేలే అదృష్టమనుకునే క్షణంలోనే ,
చురుక్కున గుచ్చుకుందొక ముల్లు..
తన ఆడతనాన్ని గుర్తు చేస్తూ..
తన ఆశలన్నింటినీ వెక్కిరిస్తూ..

రక్షగా ఉంటుందనుకున్న కన్న బంధమే,
వివక్షని ప్రదర్శిస్తుంటే ,
తట్టుకోలేని ఆవేదన,
తనని తాను చాలించుకోవాలనే ,వైరాగ్య  నిర్వేదన..

అయినా ఆశ చంపుకోలేని ఆ పువ్వుకి,
నవ్వుని జ్ఞాపకంలా చేస్తూ..,
కట్టుబాట్ల కంచెలు తోడయ్యాయి..
మూడాచారాల  ముళ్లు అడ్డయ్యాయి..
తనని ఆరాధించాలనుకునే ప్రతి  హృదయాన్ని,
గాయపరుస్తూ , రక్తాన్ని కళ్ళ జూస్తున్నాయి..

తన అందచందాలని ఆస్వాదించే వారు సైతం,
మనసారా ఆదరించక, మోజు తీరాక నలిపేస్తుంటే..
ఇక తనదైన ఆశకి చోటేది,,??
మాటకి విలువేది..? మనసుకి సాంత్వన ఏది..??

పుట్టేటప్పుడు ఎన్ని ఆశలో,
గిట్టేటప్పుడూ అన్ని ఆశలే..
ఏ  ఒక్కటీ  తీరలేదని తీవ్ర నిరాశలు  
పుట్టేదాక  ఎన్ని బాధలో 
చచ్చేదాకా అన్నీ వ్యధలే..
చుట్టు ముట్టినవన్నీ ముళ్ళ పొదలే ..

గులాబీల ఆశలన్నీ గుండెల్లోనే ఆవిరయ్యాయి ..
వాటి కోర్కెలన్నీ గుట్టుగానే మిగిలిపోయాయి ..
పరిమళాలన్నీ పట్టించుకోక  వాడిపోయాయి..
ఆత్మీయ బంధాలన్నీ అంకురంలోనే అంతమయ్యాయి..
****************************
written by ME
at 9:36am 18.4.2012



No comments:

Post a Comment